Thursday, January 21, 2010

మల్లెపూలోయ్ మల్లె పూలు..




చలం గారి పుస్తకాలను తెలియని వారికి పరిచయం చెయ్యాలని, తెలిసిన వారికి మరొక సారి గుర్తు చేయాలని ఈ బ్లాగ్ కాని, చలం గారి గురించి పరిచయ వాక్యాలు రాయాలని..... రాయ వలసిన అవసరం వుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు.. ఇప్పుడు కూడా అనుకోవటం లేదు.

కాని కొన్ని రోజులుంటాయి, నువ్వేమిటో నీకే తెలియక నీ నువ్వు ఇంకొకరి గా మారి పోయి రాధ కృష్ణుడి లో ప్రేమ తో, మీరా కృష్ణయ్య తో రాగం లో..... సైంటిస్ట్ తన ప్రయోగం తో... చిరు వెలుగు వుదయం తో... సాయంసధ్య నారింజ రంగు నీలాకాశం తో... మనసు పలికే వేణు గానం తో... కలిసి పోయి రెండూ వేరు వేరు కాదని ఏకత్వం తోచే క్షణాలు. ఆ క్షణాలే ఆ రోజులను, ఆ రోజులే జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి జీవితానికి కొత్త విలువలను కొత్త అర్ధాలను సూచిస్తాయి.. జీవిత పధాన నడిపించే వేగు చుక్క లా తోడుంటాయి.

అలాంటి రోజులు, క్షణాలు నాకు చలం ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు తోస్తాయి.. నన్ను నేను మర్చిఫొయి.. వుహూ ఆ పదం కాదు నా అనే అస్తిత్వం ఇంక అక్కడ వుండదు మొత్తానికి నేనే పూర్తి గా ఆ పుస్తకాలలోని అనుభూతి నైపోతాను... వరుసగా..... వేసవి వుదయాలు, వొంటరి వర్షపు రాత్రులు, బద్ధకం గా వూపిరి పోసుకుంటున్న వేసవి సాయింత్రాలలో మెరిసిన మల్లె నవ్వులు, మూగిన జ్ఞాపకాల చీకటి రాత్రు ల లో తోడైన వాన చుక్కల కబుర్లు.....తిని పోసిన చెరుకుప్పల మధ్యన విశ్రాంతి తీసుకుంటూ ఎదురు గా మధ్యాన్నపు ఎండ గాలి తో కలిసి నది ని అవిశ్రాంతం చేసే కల్లోల్లాన్ని చూసే రోజులు.... ఎన్నని...... మనం వున్నామని మర్చిపోయి ఆ క్షణాలలో కి వెళి పోతాం.

ఆయన ప్రేమలేఖలను ప్రత్యక్షం గా ఫస్ట్ హేండ్ ఎక్స్పీరియన్స్ అంటారే అలా ఆ లేఖలలో రెండూ పక్కలా పాఠకుడి గా, ఆ వుత్తరం లో ఒక భాగం గా ఫీల్ చేయించగలగటం ఆయన కే చెల్లు. అలాంటి లేఖలను ఈ రోజు చాలా చాలా రోజు ల తరువాత చదువుతున్నా. మన అందరికి కొన్ని చిరాకు పెట్టే రోజులు, కొన్ని అకారణం గా సంతోష పెట్టే రోజులు, కొన్ని విసుగు ను కోపాన్ని తెచ్చే రోజులు వుంటాయి కదా, ఈ మాటే అంటే నా స్నేహితురాలొక ఆమె మాకు అలా వుండటానికి ఒక అర్ధ వంతమయిన కారణముంటుంది, కారణం లేకుండా అలా వుండటానికి మాకు వెర్రీ కాదు, చలం అభిమానులమూ కాదు రెండూ దరి దాపుల ఒక్కటే లే అని పరాచికాలాడింది. నిజానికి అది పరాచికమే కాదు చాలా మంది దృష్టి లో నిజం.... కాని వుంటాయి కొన్ని రోజు లు నీ ఆత్మ తనలోకి తనే చూసి గొణుక్కుంటున్న గోలల చిరాకు రోజులు, వుదయపు వెలుగు కొమ్మ కొమ్మ ను పలకరించి కల కల లాడే చిన్ని పిట్టలను చూసి నీతో సంభందం లేకుండా అనంత వాయు గానాలలో లీనమైన నీ ఆత్మ చేసే ఆనందపు సందడుల కాలాలు, ఆషాడ రాత్రి కురిసే వాన కు ముడుచుకున్న దేహం తో ఆత్మ కలిసి, గచ్చు మీద చిందులు తొక్కి, పిల్ల కాలువలై ఇసుకు తిన్నెల మేటల మధ్య సాగర కాంతుడి తో కలవాలని వడి గా మొడలెట్టి బురద లో ఇంకే నీటిని చూసి కన్నీటి పాలయ్యే రాత్రులు.. వుంటాయి వుంటాయి అన్ని అర్ధవంతాలే కానక్కరలేదు...

అలాంటి ఒక చలి రాత్రి ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన మల్లెపూలు కవిత చదువుతూ కళ్ళు తెరిచి కలల లోకి వెళ్ళి పోయాను.. ఆ కవిత ను మీతో పంచుకుందామని దానికి ముందు ఇంత పరిచయమిచ్చేను.
ఇదుగో ఆ కవిత...



మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!
విచ్చిన మల్లెపూలు!!
ఆ పరిమళం నాకిచ్చే సందేశం
యే మాటలతో తెలపగలను.!

సాయింత్రాలు స్నేహానికి
చల్లని శాంతినిచ్చే మల్లెపూలు.

అర్ధరాత్రులు విచ్చి
జుట్టు పరిమళంతో కలిసి
నిద్ర లేపి
రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు

వొళ్ళమధ్య చేతులమధ్య
నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు

రోషాలూ నవ్వులూ
తీవ్రమయిన కోర్కెలతో
తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు

సన్నని వెన్నెట్లో
ప్రియురాలి నుదిటి కన్న తెల్లగా
యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో
గుండెపట్టి చీలికలు చేశే మల్లెపూలు

తెల్లారకట్ట లేచి చూసినా
యింకా కొత్త పరిమళాలతో
రాత్రి జ్ఞాపకాల తో
ప్రశ్నించే మల్లెపూలు

ఒక్క స్వర్గం లో తప్ప
ఇలాంటి వెలుగు తెలుపు
లేదేమో - అనిపించే మల్లెపూలు

అలిసి నిద్రించే రసికత్వానికి
జీవనమిచ్చే ఉదయపు పూలు
రాత్రి సుందర స్వప్నానికి సాక్షులు గా
అవి మాత్రమే మిగిలిన
నా ఆప్తులు!
మల్లెపూలు.... !!!