Saturday, November 21, 2009

టాగోర్ గీతాంజలి కు చలం తెలుగు అనువాదం

13. పలకని ఒక రాగం.....

నేను పాడటానికి వొచ్చిన పాట ఈ నాటికి పాడకుండానే మిగిలి పోయింది.

నా వాయిద్య తంత్రుల్ని బిగువు చేస్తో, వొదులు చేస్తో నా రోజుల్ని గడిపేశాను.

తాళం సరిగా సాగలేదు. పదాల కూర్పు కుదరలేదు. నా హృదయం లో కాంక్షా బాధ మాత్రమే మిగిలి పోయింది. నువ్వు విచ్చుకోలేదు ఇంకా. గాలి మాత్రం నిట్టుర్చుతోంది, పక్కన.

అతని ముఖాన్ని చూడలేదు నేను. అతని ఖంఠమూ వినలేదు. నా ఇంటి ముందు నుంచి నడిచే అతని మెత్తని పాద ధ్వనిని మాత్రమే వినగలిగేను.

నేలపై అతనికి ఆసనం పరవడంలోనే దినమంతా గడిచిపోయింది. ఇంకా దీపం వెలిగించలేదు. అతన్ని ఇంట్లోకి ఎట్లా ఆహ్వానించను?


అతన్ని కలుసుకోగలననే ఆశ తో బతుకుతున్నాను. కాని ఆ కల ఇంకా ప్రాప్తించింది కాదు..


13.

The song that I came to sing remains unsung to this day.

I have spent my days in stringing and in unstringing my instrument.

The time has not come true, the words have not been rightly set;
only there is the agony of wishing in my heart.
The blossom has not opened; only the wind is sighing by.

I have not seen his face, nor have I listened to his voice;
only I have heard his gentle footsteps from the road before my house.

The livelong day has passed in spreading his seat on the floor;
but the lamp has not been lit and I cannot ask him into my house.

I live in the hope of meeting with him;
but the meeting is not yet.



18. ఒంటరి సాయంత్రం నీకోసం .....

మబ్బుల మీద మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి. చీకటి పడుతోంది. ప్రియా, నన్నొంటరి గా ఈ తలుపు దగ్గర నీకై నిరీక్షణలతో ఎందుకిట్లా వదిలి వేశావు?

మధ్యాన్నపు కార్య కలాపంలో గుంపు తో కలిసి పని చేశాను. కాని ఒంటరి చీకటి రోజున నీ కోసం మాత్రమే ఆశ పడతాను. నువ్వు నీ ముఖం కనపరచక పోతే నన్నింత ఎడం చేసి వొదిలేస్తే ఈ ధీర్ఘ వర్ష ఘడియల్ని ఎట్లా గడపగలనో తెలీదు.

ఆకాశంలోని దూరపు గుబులు వంక చూస్తో కూచున్నాను. నా హృదయం, శాంతి నెరగని ఈదురు గాలితో కలిసి ఏడుస్తో ఇటూ అటూ తిరుగుతోంది..

18.


Clouds heap upon clouds and it darkens. Ah, love, why dost thou let me wait outside at the door all alone?

In the busy moments of the noontide work I am with the crowd, but on this dark lonely day it is only for thee that I hope.

If thou showest me not thy face, if thou leavest me wholly aside, I know not how I am to pass these long, rainy hours.

I keep gazing on the far-away gloom of the sky, and my heart wanders wailing with the restless wind.

Monday, August 24, 2009

రుషులూ -- యోగులూ..

చెలం "వేదాంతం" నుంచి ఒక కథ.


పూర్వకాలం రుషులు, యోగులూ కావటం చాలా సుఖం గా వున్నట్లు కనపడుతుంది. యోగ్యత వుండాలి కాని చిన్నతనం లో ఆశ్రమం లో భోజనం అది జరిగిపోయేది తరవాత సొంత రిసెర్చి కోసం ఆశ్రమాలు స్తాపించుకునే వారు. ఈ శిష్యులు గురువులు గా తయారై, గొడ్లని కాయటం, బట్టలు వుతకటం, వూడవటం, అలకటం, వంటా అంతా శిష్యులు చేసి పెట్టే వారు. రాజాశ్రయం వల్ల తిండి జరిగి పోయేది. ఇప్పటి కవుల మల్లేనే సమితులు గా, యూనివర్సిటీ ల కింద ఏర్పడి ఎవరి అన్వేషణా ఫలితాలను వారు నివేదించుకునే వారు వార్షికోత్సవాలలో.

అంతే కాక రాజులు సభ చేసినప్పుడల్లా అవి ఇవీ గట్టిగా చదివి బహుమానాలు అవి పొందేవారు. యజ్ఞాలకు యాగాలకు వీళ్ళందరు కూడేరంటే సులభం గా లక్ష ఆవులు, ఏనుగులు, లెక్కలేని ధనాలు సంభావనలు దొరికేవి. ఆ బహుమతులను ఏం చేసుకునే వారా, ఎక్కడ దాచుకునే వారా మరి లక్ష ఆవులను ఏ సంతలోనో అమ్ముకుంటే కొనే వారెవరా అనిపిస్తుంది. ఆనాటి బంగారం, రత్నాలు, విరాళాలు వింటే ఈనాటి యుద్ధ కాలపు కరెన్సీ కు ఈ గతి పట్టి వుండదా అని సందేహం వస్తుంది. కొందరికి వుద్యోగాలు అవి కూడా అయ్యేవి, రాజుల దగ్గర పురోహితులు మొదలైనవి. పెళ్ళిళ్ళూ చేసుకోవచ్చూ, సంసారాలు వుండవచ్చూ, అదీ కాక తీవ్ర తపస్సు చేసి ఏదేవినో వేస్య నో రప్పించి , విసుగు పుట్టగానే సులభం గా వైరాగ్యం లోకి పోయి, ఆమెను మళ్ళీ ఆమె స్వస్తలానికి ఏ అపవాదు లేకుండా పంపెయ్యవచ్చు. చచ్చిన తరువాత వీళ్ళకు ఇంద్రుడి దగ్గరో, బ్రహ్మ దగ్గరో సీట్లు రిజర్వు అయ్యి వుండేవి.


ఇంత సుఖం లోను వీళ్ళకో పెద్ద బాధ వుంది. వీళ్ళు నివసించే అడవులే రాక్షసులకు కూడా నివాస స్తలాలు. చాలా త్వరలో రాక్షసులు వీళ్ళ రుచి మరిగేరు. ఆ పూటకు కూర దొరక్క పోతే అట్టా షికారుకు పోయి ఒక రుషి ని తెచ్చి తరుక్కుని తినే వారు. ఈ రుషులకు యోగులకు రక్షణ అల్లా శాప దక్షత. కాని వేటగాళ్ళకు మల్లే శాపం తీసే వ్యవధి నివ్వకుండానే వీళ్ళని గొంతు నులిమేసే వారుగావును, ఆ రాక్షసులు. రాక్షస పల్లె లో ఓ రాక్షసాంగన ఇంకో రాక్షసాంగనతో


" ఏం కూరమ్మా మీ ఇంటో?" అంటే
"వంకాయ మునీశ్వరుడు" అంటుంది ఆమె


" మీ ఇంటో ఏం కూరమ్మా" అంటే,
"యోగి వేపుడు" అంటుంది రెండో ఆమె.


ఇంతలో మూడో ఆమె వచ్చి " ఇవాళ ఎవరి మొహం చూశేరో, మా ఆయనకి ఏం దొరక లేదమ్మా. గురువుకి ఆకులు కోస్తూ వుండగా ఇద్దరు బక్క శిష్యులు దొరికేరు. చట్టి అడుగున అంటుకుపోయింది కూర" అంటుంది. " యోగులు దొరికితే సులభమమ్మా, ఈ రుషుల ఈకెలు పీకేప్పటికి చేతులు పడిపోతున్నాయి." అంటుంది మొదటి ఆమె.


కాని ఈ రుషులు యోగులూ చాలా సార్లు కాటు వెయ్యనే వేసే వారు.


" మీ ఆయన ఏరమ్మా కనపడటం లేదంటే" " ఏమోనమ్మా, మా అబ్బయి పెద్ద కోరమొలిచిన పండక్కి ఓ బతికిన యోగి ని తెమ్మన్నాను, పలావు వండుదామని. ఏమైనారో, రెండువేల ఏళ్ళయ్యింది. ఇంకా రాలేదు" అంటుంది.
"మొన్న సాయింత్రం మీ ఇంటి చుట్టూ మూలుగుతూ ఓ పెద్ద పులి తిరుగుతోంది. అది మీ ఆయనేమో అనిపించింది. ఆయనమల్లే వెనక్కాలు కుంటుతోంది" అంటూంది రెండో ఆమె.


ఇది వింటున్న మూడో ఆమె రంగం మీదకు వచ్చి,
"అంతేనమ్మా మా చెల్లెలి మొగుడు అట్లానే ఓ యోగిని పట్టటానికి వెళ్లి మళ్ళీ రాలేదు. సాయింత్రానికి ఓ పెద్ద కొండసిలవచ్చి ఆమె కాళ్ళను చుట్టేసుకుంది. ఆమే కేకలు పెడితే చంపడానికి వెళ్ళాం. తీరా దగ్గరికి వెడితే కొండసిలవకి పెద్ద మీసాలు. వాటిని చూసి గుర్తుపట్టాం మా మరిది అని" అంటూంది.


ఇంతలో ఇంకో ఆమె --
"అంతకన్నా చిత్రం, మా మరదలు సంగతి , అది నీళ్ళాడింది. పత్యానికని దాని మొగుడు బాలముని కోసమని పోయి మాయమైనాడు.ఆరువేల ఏళ్ళకీ తిరిగి రాలేదు. తిండికి జరక్క మా తమ్ముళ్ళే చేసుకుంది. చేసుకున్న వెయ్యేళ్ళకే ప్రత్యక్షమైనాడు.ఓ నాటి రాత్రి వాళ్ళ మంచం కింద కన్నం లోంచి "చూస్తున్నాలే నీ పోకిల్లు" అన్నాడు దాని కొప్పు పట్టుకుని, ఎట్లా చూసేవంటే, నువ్వు వాళ్ళి కావలించుకున్నప్పుడల్లా మీ కాళ్ళ సందున కిచ కిచ మనే చుంచు ఎవరనుకున్నావు, నేనే. ఆ బాల యోగి వెధవ, కుత్తుక నులుముతుండగా, "చుంచువవు అన్నాడు" అని యేడ్చాడు.


మొత్తానికి ఈ యోగులు, రుషులు ఈ రాక్షసుల అవసరాలకు లోకువైనారు. భారతీయ యుద్ధం లో 18 అక్షోణీలు ఎందుకు గుమి గూడేరో తెలీదు. ఈ పెద్ద వీరుల చేతుల తీట వొదిలేట్టు చంపుకోడానికి తప్ప వాళ్ళు చేసిన ఒక్క పని లేదు. భీష్ముడి ఆగ్నేయాస్త్రానికి ఇటు అర్ధ లక్షా, భీముడి గదా ఘాతానికి అటు ఓ లక్షా చావటం ఒక్కటే వాళ్ళకు నియమించిన ధర్మం. అట్లానే ఆటం బాంబు కింద ఆవిరి కావటం తప్ప తక్కిన వివరాలు ఏమి తెలీవు నాగసీకా ప్రజల గురించి. ఈ యోగులు కొన్ని లక్షలు కోట్లు వరస గా ధ్వంసమవుతునే వచ్చారు. కాని ఆ అధ్యాత్మిక మధువు ఎట్లాంటిదంటే ఎన్ని ఎలుగుబంట్లు దోచుకున్నా మళ్ళీ ఆశ్రమ పట్లు పెడుతూనే వుంటారు. దాని వల్ల ఒక అవతారం, ఆ అవతారం పుట్టినపుడూ, చచ్చినప్పుడూ మధ్య మధ్యా స్తుతులకీ, ఆరాధనకి, దండకాలు చదవటానికి, వీళ్ళు హాజరౌతూ వుంటారు. ఈ లోపల వీళ్ళనెవరు భోజనానికి వుపయోగించుకోక పోతే , వీళ్ళకు కొవ్వు లేక పోతే వీళ్ళను బలిపించటానికి కొన్ని ఏళ్ళు కంద మూలాలను తెచ్చి వీళ్ళ ఆశ్రమాల ముందు పడేస్తో వుండవొచ్చు, ఈ రాక్షసులు.


సౌరిస్ అంటుంది ఈ ఆర్యులు కూడా జన సంఖ్య ఎక్కువై ఇంగ్లీషు వాళ్ళ పద్దతి మీదే వ్యాప్తి చెందేరని. ఈ రుషులు పోయి అనార్యుల దేశాల్లో ఆశ్రమాలు పెట్టుకున్నారు, ఆర్యావర్తం అడవుల్లో ఆశ్రమాలు ఎక్కువై సందులేక. మరి ఈ అనార్యులు వూరుకుంటారా? వీళ్ళను వండుకు తింటారు, వూరగాయలు పెట్టుకుంటారు. అదుగో మా రుషుల్ని హింసిస్తున్నారని వంక పెట్టి ఆర్య రాజులు ఈ అనార్యుల మీదకు దండెత్తీ వోడించి రాజ్యాలను ఆక్ర మించుకుని ఆర్యులకు చోటు చేసి, మతమూ, తమ నాగరికతా ప్రవేశ పెట్టేరు. ఆర్య కవులు ఆ అనార్యులను అనాగరికులనీ, మనుష్య భక్షకులనీ, రాక్షసులనీ, మాయావులు, పది, ఇరవై తలల వాళ్ళనీ వర్నించి, తమ రాజులను పొగిడి అక్షర లక్షలు సంపాయించే వాళ్ళు...


ఇవీ పురాణ గాధలన్నీ..

Monday, August 10, 2009

టాగోర్ గీతాంజలి కు చలం తెలుగు అనువాదం



28.
నన్నల్లుకున్న బంధాలు మొండివి. కాని వాటిని తెంపుకోవాలని ప్రయత్నిస్తే, నా హృదయం భాదిస్తుంది...

నాకు కావలసిందల్లా స్వేచ్చ. కాని దాని కోసం ఆశించటానికి కూడా నాకు సిగ్గవుతోంది.

నాకు నిశ్చయం గా తెలుసు నీలో విలువల్ని మించిన ఐశ్వర్యముందని, నువ్వు నా వుత్తమ మిత్రుడవని, కాని నా గది నిండా పేరుకున్న విలువలేని తళుకుల్ని వూడ్చేసేందుకు నా మనసొప్పదు..

నన్ను కప్పిన దుప్పటి వుత్త దుమ్మూ, మృత్యువూ. దాన్ని చూస్తే నాకు పరమ ద్వేషం. అయినా దాన్ని ప్రేమతో గట్టిగా హత్తుకుంటాను.

నా రుణాల కంతం లేదు. నా లోపాలు బహుళం. నా లజ్జ రహస్యమైనదీ, భారమైనదీ. ఐనా నన్ను దిద్దమని నిన్ను అడగటానికి వొచ్చి, తీరా నా ప్రార్ధన ను కటాక్షిస్తావేమోనని వొణికిపోతాను.



28.

Obstinate are the trammels, but my heart aches when I try to break them.

Freedom is all I want, but to hope for it I feel ashamed.

I am certain that priceless wealth is in thee, and that thou art my best friend, but I have not the heart to sweep away the tinsel that fills my room.

The shroud that covers me is a shroud of dust and death; I hate it, yet hug it in love.

My debts are large, my failures great, my shame secret and heavy; yet when I come to ask for my good, I quake in fear lest my prayer be granted.

Monday, August 3, 2009

ఆనందం

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...

లోకం
ఆనంద మయం. ఆనందం కోసమే ప్రయత్నిస్తుంది. ప్రతి జీవి యొక్క పరమావధి ఆనందమే... పశువులు పక్షులు అన్నిటికి బాధ నుంచి తప్పించుకోవాలని హాయి గా బతకాలని ఒక్కటే ప్రయత్నం. మనుష్యులు హాయి గా బతకటమే కాకుండా కొన్ని విధాలైన ఆనందాన్ని కూడా పొందాలని చూస్తారు. బాధ కావాలని కోరే వారెవరు లేరు. కోరి బాధ లు పడే వాళ్ళూ, సుఖాన్ని త్యజించే వాళ్ళూ లేక పోలేదు. చచ్చిన వాళ్ళను మర్చిపోక వూరికే జ్ఞాపకం చేసుకుని ఏడ్చే వాళ్ళూ , ఇతరుల సౌఖ్యం కోసం తమ ఆనందాన్ని వొదులుకునే వాళ్ళూ, నోట్లోంచి కడ్డీలు దూర్చుకునే వాళ్ళూ , పంచాగ్ను ల మద్య తపస్సు చేసే వాళ్ళూ వున్నారు. కాని , ఆ బాధ వాళ్లకు ఆనందం కనుక లేక ఆనందకరమైనది బాధ వల్ల సమకూరుతుంది అనుకుంటారు కనుక , ఆ బాధ పడతారు.

ఆనందం అనేక రకాలు. ముఖ్యం పంచేంద్రియాలవల్ల, సంపాయించేది. మనసు వల్ల పొందేది.. వున్నతమైన ఆలోచనలూ, సంభాషణా స్నేహమూ ప్రేమా మొదలైన వాటివల్లా సౌందర్యాల వల్ల కలిగే ఆనందం; అందమైన కధలూ, నాటకమూ, సంగీతమూ, బొమ్మలూ మొదలైన వాటివల్ల కలిగే ఆనందం. ఆనందం లోనే యెక్కువ తక్కువ లు వున్నాయి. తిని నిద్ర పోయి జంతువులవలే బతుకులో పొందే ఆనందం, గంతులేసి నవ్వి అల్లరి గా వుంటే వచ్చే ఆనందం, తృప్తి పడి నా కింకేమీ అక్కర్లేదని శాంతం గా వుండే ఆనందం, లోకమంతా తనకే కావాలనే అధికారాలకీ, ధనార్జనకీ కష్ట పడుతు పొందే ఆనందం, దేశాల్ని, సంఘాల్ని బాగు చెయ్యలనీ, కొత్త విజ్ఞానాన్ని సంపాయించాలని, కొత్త లోకాన్ని కనిపెట్టాలనీ ప్రయత్నిస్తో జీవితాలర్పించే ఆనందం.

ఇవేకాక మనకు తెలీనివీ, భూలోకానికే చెందనివీ, ఇంకా మనం చూసే ఆకాశానికీ ఇతర గోళాలకు చెందినవీ అనేక విధాలైన ఆనందాలు వుండవచ్చు. చీమ పొందే ఆనందం వుంది మనం పొందే ఆనందం వుంది. భేదం ఇంద్రియ భేదం వలన కలుగుతోంది. దాని కళ్ళు మన కళ్ళు ఒకే కాంతిని చూడవు. చెవులు ఒకటే ధ్వని ని వినవు. అట్లానే మనకే ఇంకా బలమైన చెవులు - కళ్ళు వుంటే, ఆకాశ ధ్వనులు, కాంతులు, -- ఆకులు చేసే రహస్య గీతాలు -- కీటకాల సంభాషణ, -- ఎన్ని వినగలమో, చూడగలమో.

అంతే కాదు పంచేంద్రియాలు వుండబట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నాము. పది జ్ఞానేంద్రియాలుంటే - పది రకాలు ఐదూ కాక, ఇంకో విధమైనవి వుంటే - కొంచం ఆలోచిస్తే తెలుస్తుంది - అనంత మైన ఆనందాలు వుండటానికి వీలుందని. భూలోకం లో విధమైన ఆనందాలున్నాయి; చంద్ర లోకం లో, అనూరాధా లోకం లో, ఆరుద్ర లోకం లో -- చెప్పలేము

ఇవన్ని శరీరాలకు సంభందించిన ఆనందాలు. మతాలు ఇంకో ఆనందాన్ని గురించి చెపుతాయి. ఆనందాన్ని స్వర్గ లోకం లో పొందుతామంటారు. ఆనందం రెండు విధాలు. భూలోకపు ఆనందాల వంటివే శరీరానికి సంభందించినవి, రెండోది ఈశ్వరుడి సాన్నిధ్యం వల్ల కానీ, స్తోత్రం వల్ల కాని, లేక ఐక్యం వల్ల కాని, కలిగే ఆనందమూ, స్వర్గానందాలకు భూఆనందాలకు విరోధం అంటారు. అవి కావాలంటే వీటిని త్యజించాలి. ముఖ్యం గా స్వర్గం సంగతి తెలిసిన వాళ్ళు కొన్ని నీతులను చట్టాలను ఏర్పరిచారు. ముఖ్యం గా వాటిని అతిక్రమించకుండా సంచరిస్తే స్వర్గము, ఈశ్వరుడు దొరుకుతారు. కాని , ప్రకారం చేస్తున్న మనుష్యులెవ్వరు కనబడరు. ఎవరికి అది నిశ్చయం లేదనుకుంటా. ఒకవేళ అందరు వివేక వంతులై స్వర్గం కోసం క్షణ భంగురమైన భూలోక ఆనందాలని త్యజించి శాస్త్ర ప్రకారం చట్టాలు, ధర్మాలు అనుష్టిస్తారు అనుకోండి, స్వర్గం ఏట్లా వున్నా భూలోకం ధ్వంసమైపోతుంది.

ఇప్పుడున్న తమాషా, నవ్వు, ప్రేమా, స్నేహమూ అన్నీ నశించి లోకం నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఎంత త్వరలో లోకాన్ని విడిచి లోకానికి వెళితే అంత వుత్తమం గా తోచాలి ప్రజలకు. మొత్తానికి ఎవరిని చూసినా ఈశ్వరుడు, ఆయన లోకమూ, దాని మార్గము గురించి మాట్లాడే వాళ్ళే కాని, లోకాన్ని విడిచి లోకానికి, దాని ఆనందాల కోసం త్వర గా ప్రయాణమవుతున్న వాళ్ళు ఎవ్వరు కనిపించరు.

ప్రతి వాళ్ళు బాధ నుంచి తప్పించుకుని ఆనందాన్ని పొందుదామని చూస్తారుగాని నేర్పు కలిగి ఆనందాన్ని పొందగలిగే వాళ్ళు కొద్దిమందే కనపడతారు. మన "ఇన్ స్టింక్ట్" ఆనందం కోసం బలీయం గా వుంది. తనకు బాధ కలిగించే పనుల నుంచి మన శరీరం తనంతట తానే తప్పుకుంటుంది. కాని మన మనసుకు మాత్రం ఇంకా "ఇన్ స్టింక్ట్" రాలేదు. జ్ఞానము , నేర్పు ఇంకా సంపాయించలేదు. ఏది తమకు ఆనందం ఇస్తుందో, బాధల నుంచి ఎట్లా తప్పుకోగలరో మనుష్యులు ఇంకా నేర్చుకోలేదు, కనుకనే ఎవడు వచ్చి "ఆనందం" అని కేకలు వేసినా వాడి వెంట పరుగెత్తుతారు.

ఆనందం విషయమై కొన్ని నిబంధనలు కనపడుతున్నాయి.
నాకు ఆనందం కావాలి, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే వొచ్చేట్లు కనపడదు. ఒక కార్యం ద్వారానే కలుగుతుంది ఆనందం. మనసు కార్యం మీద వుండాలికాని ఆనందం మీద వుంటే ఆనందం చెదిరిపోతుంది. తీపి కావలన్న వాడూ తీపి కోసం ఎక్కడన్నా వెతుకుతుందా? తీపి నివ్వగల చెరుకు కోసం వెతకాలి. అట్లానే ఆనందం కావాలిస్తే ఒంటరిగా కూచుని ఎవరికి లేకుండా కొంత ఆనందంసంపాయించుకోవాలంటే అది క్షుద్రరూపాల ప్రసన్న మవుతుంది. ఒక్క నిమిషము లో నశిస్తుంది. మనం జీవిస్తున్నాం, మనకు ఆనందం కావాలి అనే ధ్యాస లేకుండా జీవితాన్ని గొప్ప వుద్యమాల్లో, లోక క్షేమానికి ప్రపంచానందానికి చేసే ఘన ప్రయత్నాలలో ఐక్యమయ్యే మనిషి పొందే ఆనందాన్ని స్వార్ధపరులు పొందనట్లు తోస్తుంది. మొదటి రకపు ఆనందం స్వభావమే వుత్తమమైనది గా తోస్తుంది.. ఒక ఆనందమైన కధనుగాని, బొమ్మను గాని సృష్టించే ఆనందం తలుచుకోండి...

ఆనందం ఎవ్వరికి ఇవ్వను; నేనే దాచుకుంటాను అన్న నిమిషాన ఆనందం మాయ మౌతుంది . చెట్టునున్న పువ్వును జేబులో దాచుకున్నట్లు, ఎవరెత్తుకుపోతారో అని భార్యలను దాచుకునే వాళ్ళు, విషయమై కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.... చక్క గా యోచిస్తే ఇతరులనుంచి దాచుకున్నామన్న తృప్తి తప్ప మాత్రమూ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు.

తనే ఆనందం పొందాలనే కార్యాలకన్నా ఇతరులకు ఆనందమిద్దామనే వూహ తో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. తిండి తినటానికి సంగీతం పాడటానికి భేదం ఆలోచించండి. అందువల్లనే ప్రేమ వలన వచ్చే ఆనందం అద్వితీయమైనది. ఎందుకంటే ప్రేమ వున్నప్పుడు తనకి ఎంత ఆనందం వస్తుందనే ధ్యాస వుండదు. ఎంతసేపు ఇతరులకు ఎంత ఆనందం ఇవ్వగలమనే యోచనే బలం గా వుంటుంది..

ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి వుపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి శక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి అనందాన్ని పొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మ లూ వున్నాయి.

ప్రతి జీవికి కొంత శక్తి వుంది. కొంత కాలం వుంది. శక్తినీ కాలాన్నీ ఆనందం లో కూర్చుకునే తెలివితేటలు లేవు. జీవితం "ఆర్ట్". ఒక కళ. మనం వివేకవంతులమైతే మన శక్తి నంతా ఆనందం గా మార్చుకోగలం. మన కాలమంతా మనకు ఆనందాన్ని ఇచ్చేట్లు చేయగలం. మహా శక్తి మన పుటకవల్లనో సంస్కారం వల్లనో కొంత కలుగుతుంది. కొంత మనకు చిన్నప్పుడు ఇతరులు నేర్పిన "అలవాట్ల" వల్లా పెద్దయ్యి మనకు మనమిచ్చుకునే శిక్షణ వల్లా యేర్పడుతుంది.

లోకం లో మొత్తానికి ఎవరు ఆనందవంతులుగా కనపడుతున్నరంటే, వారి స్వభావాలకీ, గుణాలకి, వేటి వేటి మధ్య వున్నారో పరిస్తితులకు; సమత్వం కలిగించుకున్న వాళ్ళు.. చాపలు ఎంత మంచి మందిరాలలో వుంటే యేమి లాభం? ఏనుగులు సముద్రాల మధ్య తెల్లని ఇసుకల్లో పడుకుంటే ఏం సౌఖ్యం? తక్కువ స్థితిలో వున్నా, ఎక్కువ స్థితి లో వున్నా సరిపోవాలి. లోకానికి వ్యక్తి కి సంధి కుదరాలి. వ్యక్తి లోని శక్తులన్నీ చక్క గా వినియోగమయ్యే పరిస్తితి వుండాలి. చిత్రకారుణ్ణి చిత్రించ వద్దని ఆజ్ఞ పెట్టి మహారాజు గా చేసినా అతనికి తృప్తి వుండదు. తన కళ కోసం బాధ లోనే వుంటాడు.


లోకం లో అనేక విధాలైన ప్రాణాలున్నాయి. కంటి కగపడని సూక్ష్మ జీవుల నుంచి మనుష్యుల వరకు -- అనేక స్తితులలో అనేక ప్లేన్ లో బ్రతికేవి వున్నాయి. వేటి గుణాలు,ఆకారం,కష్టాలు, ఆనందం,ఇంద్రియాలు, బుద్ది వాటివే. కీటకాల్లో అనేక రకాలు. పక్ష్యులలో - చేపల్లో - జంతువుల్లో అనేక బేధాలు వున్నాయి. అట్లానే మనుష్యులలో వున్నాయి. దేశం వల్ల, రేస్ వల్లా పరిస్థితుల వల్ల కలిగే బేధాలు కాక మనిషికి మనిషికి ముఖం లో -- కంఠం లో దేహాకారం లో... రేఖలలో, రుచులలో, గుణాలలో బేధాలున్నాయి. బేధాల్ని మత ప్రవక్త లు నీతి ప్రవక్త లు ఒప్పుకోరు. సర్వ మానవులకు ఒకటే మత విశ్వాసం, ఒకటే నీతి, చట్టము విధిస్తారు. ఒకరికి కుదిరిన మందు ఇంకొకరికి కుదురుతుందని, ఒకరికి ఆనందమిచ్చిన విషయం ఇంకొకరికి ఆనందమిచ్చి తీరాలని మూఢాభిప్రాయం ప్రజలనికా వదల లేదు. అసంఖ్యాకాలైన ఆనందాలిని, అభిరుచులను, సౌందర్యాలను ఏర్పరిచిన సృష్టి కొల్లబోలేదు.... వాటినన్నిటిని వివిధ రీతుల అనుభవించేందుకే వివిధాలైన స్వభావాలను సృష్టించింది. ఏకత్వం, సమానత్వం సృష్టి సూత్రానికే విరుద్ధం.

ఒక కాలం లో దేశాలకీ, సంఘాలికి సరిపడిన నీతి, ఆచారం ఇంకో కాలం లో కూడా సరిపడి తీరాలని, ఒక దేశానికి జాతికి అనుకూలించిన పరిస్తితులు ఇంకో దేశానికి జాతికి అనుకూలించాలని వాదించే వారు అనేకులు. ఎట్లా మనిషి మనిషి కు రూపము, బుద్ది, మారుతుందో అట్లానే వారి స్వభావాన్ని, సంస్కారాన్నీ, బుద్ధి ని బట్టి నీతి ఆనందం మార తాయంటే అంగీకరించరు. థియరీ లో అంగీకరించినా ఆచరణ లో ఒప్పుకోరు.

మత సిద్ధాంతులు, నీతి ప్రవక్త లు,ప్రతి వారమూ సాయింత్రమూ వేదిక నించి, రోడ్డు మూలల నుంచి వుపన్యాసాలిచ్చే దేవ భృత్యులూ ఎవరికి తోచినట్లు ఆనందపడే విధాలు ప్రకటిస్తూ వుంటారు.


"సత్యం చెప్పండి బాధలన్నీ పోతాయి" " నా గీతాలను చదవండి", క్రీస్తు ను నమ్మండి", "యోగం చెయండి", "తొట్టి వైద్యం", కార్కు టిప్పు సిగిరెట్ట్లు," , " చచ్చిన వారితో సంభాషణ" " అపక్వాహారం", "సర్వ భాతృత్వం" --తలనూనెలు - స్వరాజ్యం, -- లైబ్రరీలు, " ఇట్లాంటి వాటి ద్వారా వేనవేలు చిరతరానందాన్ని ప్రపంచాలకు ప్రకటిస్తున్నారు.


ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చే మాట నిజమే కాని కొన్ని కొన్ని కొందరికి మాత్రమే ఇస్తాయి. కాకి, చచ్చిన ఎలకను తింటే ఆనందమని ఏనుక్కి చెప్పి, చేపలా నీటిలో ఈదమని నక్క కు చెప్పినట్లు వుంటుంది. ప్రతి వాడు తన స్వభావానికి, తన గుణానికి ఆనందం కావాలో అవి కనుక్కోవాలి. స్వభావం ఆనందం వైపు ఈడుస్తుంది. కాని ప్రకటనలు చూసి మోస పోతారు. ప్రకటనలలో ముఖ్య మైనవి శాస్త్రాలు,, నీతులు, ఆచారం, ధనం, అధికారం మొదలైన భ్రాంతులు. ఒక యోగి వచ్చి ఆసనం చూపగానే అందరూ ఆసనాలు ప్రారంభిస్తారు. పండితులు వచ్చి జుట్టు గొరిగించమనగానే గొరిగిస్తారు. శాంతి లేక కొట్టూకునే ధనవంతుడు భార్య కావాలని యేడిచి పెళ్ళి చేసుకుని "ఎందుకు చేసుకున్నానని" యేడుస్తాడు. పిల్లలు లేరని ఏడ్చే వాళ్ళు,, వుద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు, ప్లీడరై కవుల వెంట పరుగెత్తే రసికుడు, పెళ్ళి చేసుకుని నమ్మకం గా నిలువలేని స్త్రీ, చదువుకుని ఆరోగ్యం పోగొట్టుకున్న రోగి,
కధలు చదివి, సినిమాలు చూసి భ్రమసి ఇల్లు వదిలి పరుగెత్తి తిరిగి వొచ్చిన జోగి, -- అందరూ, ఇట్లాంటి మూర్ఖులు - తమ ఆనందం తెలీక మాటలు నమ్మి మోసపోయిన ధౌర్భాగ్యులు,. తనకు లేని వస్తువు ఆనందం ఇస్తుందనుకోవటం ఈ భ్రమలలో ముఖ్య మైనది.


"ఈ పెళ్ళి నరకం " రా అని ఎంత మంది ఎంత చెప్పినా బాల బ్రహ్మచారి ససేమిరా నమ్మడు. " నీ పెళ్ళాన్ని వదలవేం?" అంటాడు. "ధనం వల్ల సౌఖ్యం లేదు" అని ధనికుడెంత అరిచినా బీదవాడు నమ్మడు. "ధనమంతా నాకియ్యవే" --అంటాడు. ఏ ఆనందం రాకపోయినా ఆ పెళ్ళాన్ని, ధనాన్ని వొదిలే ఆత్మబలం వాళ్ళకు లేదనే సంగతి వీళ్ళకు తెలీదు.


కొందరికి దేశ విప్లవం, కొందరికి తిండి, కొందరికి ప్రేమ, కవిత్వం, తగాదాలు, - నిద్ర - ఇట్లా అనేక ఆనందాలు వున్నాయి. తత్వాన్ని బట్టీ మారుతో, ఎవరు చెప్పిన మాట వినకుండా, తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ను నమ్ముకుంటే, ఏ మనిషికి అతని ఆనందమేదో స్పృష్టమవుతుంది. ఏ మృగానికి దాని ఆహారమేదో అర్ధమైనట్లు... కాని ఈ మనుష్యులలో జన్మమంతా మాంసం తినే ఆవులు, గడ్డి మేసే సింహాలూ వున్నాయి. -- పైగా అజీర్నమెందుకా అని ఆవు అనేక రకాల మాసం రుచి చూస్తుంది. సిం హం రక రకాల గడ్డి తెప్పించుకుని మేస్తుంది. కాని ఆ గడ్డిని ఇది ఆ మాంసాన్ని అది వొదిలే తెలివితేటలు కాని, ధైర్యం కాని, శక్తి కాని వాటికి వుండవు.

కవిత్వం చదివి " ఆహా సూర్యాస్తమయం యెంత అందమైనది ! నేను చూడనే లేదే " అని ఒకడు సాయింత్ర్రం గోదావరి గట్టున కూర్చుంటే ఆ ఆనందం వొస్తుందా? ఆవడలో, ఇంటి తగాదాలో, సినిమా కథలో, ఏదో తలుచుకుంటూ కూచుంటాడు అంత సేపు...!


అట్లానే కొందరికి త్యాగం ఆనందమిస్తుంది -- కొన్ని పరిస్తుతులలో. కాని ప్రతి వుపన్యాసకుడు, గ్రంధకర్తా త్యాగం చెయ్యమనే వాడే -- కవిత్వానికని, సత్రానికని, కొడుకు పెళ్ళికని, దేశానికనీ, పత్రిక్కి చందా కని త్యాగం రాదు. ఏ స్వభావానికి ఏ త్యాగం ఆనందమిస్తుందో అదే అవసరం, ఆరోగ్యమూ... కొందరికి అసలు త్యాగమే పనికి రాదు. చాలా మంది త్యాగాలు ఏదుస్తూ చేస్తారు. మతము ధర్మము డ్యూటి అని పేర్లు పెట్టి త్యాగాలు చేస్తారు. సాధారణం గా తల్లులు భార్యలు చేసే త్యాగాలు ఇట్లాంటివే. ఎవరికే త్యాగం అవసరమో వళ్ళ ఆనందమే నిర్ణయించాలి. ఒక స్త్రీ తన భర్త ను వదిలి పిల్లలను వదిలి పనికిమాలిన ప్రియుడి వెంట వెళుతుంది. ఇంకో స్త్రీ పనికి మాలిన భర్త కోసం ప్రియుణ్ణీ లోకాన్నీ, పిల్లలనీ వదులుకుంటుంది. ఇంకో ఆమె బిడ్డ కోసం భర్త ని, సంఘాన్ని, నీతి ని వదులుతుంది.. వీటిల్లో సంఘానికి నచ్చినవి మెచ్చుకుంటారు. తక్కినవాటిని ఖండిస్తారు. కాని ఏది ధర్మమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే కాని మనుష్యులు కాని శాశ్త్రాలు కాని నిర్ణయించలేవు... ఎందుకంటే ఆనందమివ్వని ధర్మం నీ ధర్మం కాదు, ఇంకొకడిదీ,

దేశానికి ప్రతివాడు త్యాగం చెయ్యాలని అంటారు. అక్కర్లేదు అంటే తిడతారు. ఎవరి హృదయం దేశభక్తి తో పరవశమౌతుందో వాళ్ళు సర్వము త్యాగం చెయ్యనే చేస్తారు. ఇది మన ధర్మం కనక చేయాలి అనే ప్రసక్తే వుండదు... "ఇది నా ధర్మం" అనుకునేప్పటికే ఇతరులు విధించిన ధర్మమని వ్యక్తమవుతుంటుంది... అట్లా దేశభక్తి వల్ల అనందం రాని వాళ్ళు ధర్మమని కీర్తికని, పక్కవాడు చేసేడని, చాలామంది చేసేరు... త్వరలోనే చింతించారు... వారి స్వభావం ఆ త్యాగానికి తగినది కాదు గనుక.

సుఖము బాధ పరిస్తితులు తెచ్చి పెడుతు వుంటాయి, చాలా మంది ఏమి ఆలోచించకుండా అనుభవిస్తూ బతుకుతారు. తాము ఎంత వరకు ఆ బాధలకు కారణం, తప్పించుకోవటానికి తమ ప్రయత్నమెంతవరకు వుపయోగపడుతుందో, యోచించరు. కర్మ లోనూ, జ్యోతిష్కం లోను నమ్మకం ఈ నిద్ర కు తోడ్పడి, జోల పాడుతుంది. జీవితం లో సంతోషం లేనప్పుడు కొత్త సంతోషము కల్పించుకోగలం. బాధలు తటస్తించినప్పుడు నిగ్రహించుకోగలం. బాధను ఎదిరించి పోట్లాడితే చాలా వరకు లోబడుతుంది. కాని ఆ జ్ఞానము శక్తీ చాలా కొద్ది మందికే వున్నాయి.

లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది., కాని అనుభవించమని బలవంతపెట్టగలదా? అట్లానే జీవితం కష్టాలను కల్పిస్తుంది, కాని అనుభవించమని బలవంత పెట్టలేదు.

వెయ్యకు తొమ్మిదివందల తొంభైమందికి ప్రత్యేకం గా ఏదో అందరాని ఆనందాన్ని సాధించాలనే ఆర్జి వుండదు. ఇంకా మృగాల స్తితి లోనే వున్నారు. సుఖం గా తినటమూ, కనడమూ , చావడమూ , వాళ్ళు చేయవలసిందల్లా. అదే వాళ్ళ ఆనందము. కాని ఆ సంగతి గమనించరు. ఘన కార్యాలు చేసిన వాళ్ళ గురించి విని కని, చదివీ, తమకు లేని శక్తులు వున్నయనుకుని అనుసరించ పోతారు. ప్రయత్నించి విఫలులైన బోసులూ, శాండో లు, శుక మహర్షులు, రవీంద్రులు, I.C.S లు ఎందరో వున్నారు మన మధ్య. నరకం, స్వర్గం సంగతులు విని, భయపడి, ఆశపడి భక్తి ని, వైరాగ్యాన్ని, నటిస్తారు. దాని వల్ల రోగాలు బాధలు అప్పులు ఇన్ని పడతారు. ఎంత తన్నుకున్న శాస్త్రాలు ఎంత ఘోషించినా ఎన్ని తత్వాలు పాడినా అందరు విరాగులు కాదు, ధర్మాత్ములు కారు. ఆ పాడే వాళ్ళకు తెలుసు "అన్నళ్ళీ ముచ్చటలు - తనువులు శాశ్వతమా" అని పాడి విరక్తి పుట్టిస్తారు. కాని ఒక్క గుప్పెడు బియ్యం మీదో, ఒక్క కానీ మీదో మనకు విరక్తి కలిగితే చాలు ఆ పూటకి, వాడికి తృప్తి. తమ జీవితం లో ఆనందం ఎట్లా కలుగుతుందో తెలిసినా, ఆ ఆనందం కోసమే ప్రయత్నం చేసి ఆటంకాలను వదులుచుకునే వాళ్ళూ చాలా కొద్ది మంది. ప్రతి పని విషయమై కూడా
'ఇది నా ఆత్మ కు ఆరోగ్యమా కాదా? నాకు లభ్యమైన కాలాన్ని, శక్తి ని, ధనాన్ని ఆనంద రూపం గా మారుస్తున్నానా లేదా?' అని విమర్శించరు. మొహమాటం, ప్రతిష్టా, భేషజం, కపటమూ ఇన్నీ అడ్డం వస్తాయి.

వొంటి నిండా చీము తో, చెయ్యి ఎత్తలేక వొణికే వాడికి కానీ ఇవ్వము. మనకి అక్కర్లేని పత్రికకు చందాగా అప్పుడే ఇంకొకడు నాలుగు రూపాయిలు పట్టుకుని పోతాడు.

మనం మీటింగులకు ప్రెసిడెంట్లు గా వుండటం, అనుష్టించే కర్మ కలాపాలు, తగాదాలు, అన్నీ మాత్రమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయా? వుత్తమ లోకం లో నమ్మకం లేని వాడు బ్రాహ్మల కాళ్ళు కడిగి తద్దినం పెడతాడు. బ్రాహ్మణ్ణి తిట్టి కమ్మ బ్రాహ్మణ్ణి పూచ్చేసి దక్షిణలిస్తాడు.

మన వేషం, బట్టలు, జుట్టు, తిండి, మనం పెట్టే భోజనాలు, ఆడే మాటలు, అన్నీ ఏమీ ఆనందం ఇవ్వని శుష్కమైన ప్రదర్శనాలు --ఎన్ని!
జీవనమంతా వాటితోనే వృధాగా గడిచిపోతుంది. మనకు ఆనందం ఇచ్చే వాటిని అనుభవించటానికి జంకుతాము. ఎవరు చూస్తున్నారో అనే భయం తో, చక్కని మనిషి నడుస్తో వుంటే తేరి చూడ్డానికి భయం, భోగమాట చూడ్డానికి భయం, బట్టలు లేని బొమ్మలు, వెంకటాచలం కధ లు ఇవన్నీ రహస్యం గా ఆనందిస్తాము.

ఇట్లా ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోతాయి. మనకు ఆనందం వుంది అని ఇతరులు అనుకోవటానికి ఆనందాన్ని ధార పోస్తాం. మనం కట్టే డాబైన ఇల్లు, మోసే బంగారు నగలు, చేసే గొప్ప పెళ్ళిళ్ళు, ఖర్చులు, కష్టాలు, ఏడిపించుకు తినే అల్లుళ్ళు, అన్నీ ఒక రవ్వ ఆనందాన్ని ఇవ్వవు. కొడుకుని ద్వేషిస్తాము; వొదిలే ధైర్యం లేదు, భార్యలు భర్తలను, భర్తలు భార్యల్నీ,వొదిలే ధైర్యం లేదు. ఇష్టం లేని వాడు వొస్తే వొద్దని చెప్పే ధైర్యం లేదు.

నీ జీవితం దేనికి, ఆనందానికి ఏర్పడిందో చూడు. ఆనందం నీతి గాని కాక పోని, ధర్మం కానీ, అధర్మం కానీ, వున్నతం కానీ కాక పోనీ .... అన్నిటినీ -- బంధువుల్నీ, కులాన్నీ, నీతిని, చివరకు నీ సౌఖ్యాన్ని, అన్నిటిని త్యజించి అవసరమైతే అధర్మాన్ని ఆశ్రయించు. ప్రయత్నమే, కష్టమే, రాపిడే ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. నీ ఆత్మ లో కొత్త విస్తీర్ణం, నీ కళ్ళ ముందు కొత్త లోకాలు వెలుగుతాయి. తప్పు కానీ, ఒప్పు కాని వెనుక ముందు చూడకు. తప్పైతే దిద్దుకోవటానికి చాలా కాలముంది. వెనుకముందులు యోచించే చచ్చు బతుకు కంటే ధీరత్వంతో ముందుకు సాగి గోతిలో పడేవాడికి ఎక్కువ ఆనందముంది లోకం లో.

ఆనందాల్లో డిగ్రీలున్నాయి. పేడ తింటో సుఖించే పురుగూ, కాంతిలో ఎగురుతు అరిచే చిలుకా, డబ్బు లెక్క పెడుతో తన్మయత్వం లో పడే పిసినారి, దేశం కోసం గుండు దెబ్బ తిని చస్తో ధన్యుణ్ణనుకున్న యోధుడూ, స్త్రీ బొమ్మ ను చెక్కి తను కల్పించిన ఆనందాన్ని తాను చూసి మూర్చిల్లే శిల్పీ, అనంత విశ్వం లో తన ఆత్మ ను కలిపి సర్వ జీవుల సుఖ దుఖాలు తనలో అనుభవించగల యోగీ, అందరూ ఆనందాన్నే అనుభవిస్తున్నారు. కానీ అన్నీ ఒకటే డిగ్రీలోవి కావు. లోకం చూసిన కొద్దీ అనుభవం విషయం లో కూడా 'లైఫ్' లో గొప్ప 'ఎవల్యూషన్ ' కలుగుతున్నట్లు తోస్తుంది.

కొత్త ఆనందాలను సగం సగం తోచి తామందుకోలేని సౌందర్యాలనూ, అనుభవించే విధం తెలీక, తపన పడి, జీవులు తమ ఇంద్రియ శక్తి ని మార్చుకోవాలని తమకు తెలీకుండానే ప్రయత్నించి ఒక రూపం నుంచి ఇంకో రూపం పొందుతున్నట్లు తోస్తుంది. రెక్కల పురుగు ఇంకా విస్తీర్ణత ను కోరి కోరి చిలుక కావొచ్చు. పిల్లి ఇంకా బలాన్ని గభీరాన్నీ కోరి సిమ్హం కావొచ్చును. అట్లాగే ఒకడు తనలోలేని శక్తుల్నీ కోరి కోరి జన్మలోనైతేనేం, లోకంలోనైతేనేం, పాటకుడూ, వస్తాదూ, యోగీ, కిన్నరుడూ లేక రాక్షసుడుగా మార వచ్చు. అట్లాంటి మార్పు రాక పోతే, నా హృదయం లో చూచాయ గా తోచే వున్నతానందాలూ, నేను కలలు గనే లోకాలకి సంబంధించని సౌందర్యాలు, నేను పొందాలని కోరే మానవాతీత శక్తులూ ఇవన్నీ అర్ధ విహీన మవుతాయి. భోజనమూ, ఆరోగ్యమూ, ధనమూ వుండి కూడా ఆత్మలు ఎందుకిట్లా తమకే తెలీని ఆరాటాలతో బాధ పడాలి? పాకే బిడ్డ ఎన్ని సార్లు పడి దెబ్బ తిన్నా నడవాలని ఎందుకు ప్రయత్నం చెయ్యాలి? అదేననుకుంటా, సృష్టి సూత్రం. మనం అందుకోగలిగి నంతవరకు అభివృద్ధి ఒక్క జీవితం లోనే నిశ్చయం గా పొందగలుగుదుమనుకునే వాళ్ళు మూర్ఖులు, జన్మలనేవి వుంటే, ఎప్పటికో సాధించవలసిందే. ఏమైనా, ఆనందానికిగాని చేసే ప్రయత్నం కూడా ఆనందమివ్వాలి. ఇవ్వకపోతే నీ ఆనందం అది కాదు.

"నీకింకేం కావాలి, ఎందుకట్లా వెతుకుతా?" వంటారు మిత్రులు.

'కారణం లేని ఆరాటం -- సృష్టికి అర్ధమేమిటి, నీతి ఏమిటి, పాపమేమిటి, నేను నమ్మేవి చేసేవి సత్యమా -- అనే మీమాంస, కొత్త సౌందర్యాలకోసం, ఎండమావుల కోసం వలే, రెప్పలార్చుకుంటో పరుగులు: మనకు కానిది, మనం అందుకోలేనిది, మనం మిస్ అయింది, ఎంతో లోకం, ఎంతో జీవితం, కాలం, అందం వృధా పోతుందనే దిగులు -- ఇవేమి లేకుండా తక్కిన వారివలే బతికి కూచోకూడదా ?' అని అడుగుతుంది శ్రమపడ్డ ఆత్మ.

కాని ఏమి లాభం? ఎందుకా విధం గా రెక్కలు కొట్టుకుంటో పరుగెత్తుతావు? నేను నీకు పళ్ళు పెడతాను, ఆడ చిలుక ను తెస్తాను, నా ఇంట్లో వుండమని చిలక నడిగి ఏమి లాభం... ???

Tuesday, May 12, 2009

చలం అభిమానులందరికి నమస్సులు. చలం శతజయంతి సంధర్బం గా ఓల్గా గారి చేత ప్రచురింప బడిన నూరేళ్ళ చలం అనే వ్యాస సంకలనం నుంచి విశ్వం గారు రాసిన ఒక వ్యాసాన్ని మీ ముందు వుంచటానికి ప్రయత్నించాను.
ఓల్గా గారు అనుమతిస్తే మిగతా వ్యాసాలు కూడ త్వరలో మీ ముందు వుంచాలని నా ఆశ,

Monday, May 11, 2009

యు . యఫ్. ఎ . అంతర్జాతీయ అధ్యక్షుడు చలం. -- వి . విశ్వం.

యు . యఫ్. ఎ . అంతర్జాతీయ అధ్యక్షుడు చలం. -- వి . విశ్వం.

'ఎందుకండీ ఆ యూస్ లెస్ ని అట్లా వాళ్ళు మేపటం?' అని వున్న కోపాన్ని నా ముందు కక్కేశారాయన.

ఆయనెవరంటే ఒక పెద్ద ఉద్యోగి. పండితుడు కూడా. ఆయన అభిప్రాయాలకు, అభిరుచులకు విలువైన స్థానం వుంది. యూస్ లెస్ ఫెలోస్ అని ఆయన అన్నదెవర్ని అంటే వాళ్ళు చలానికి అతుక్కు పోయిన వాళ్ళు. ఏదో ఒక చోట జీవితం లో దెబ్బ తిన్నవాళ్ళు, నెలలు, సవత్సరాలూ చలం దగ్గరే వుండి తమను తాము రీచార్జీ చేసుకుంటున్న వాళ్ళు. మేపుతున్న వాళ్ళు చలం, సౌరీస్ గారు! నాకో పేరున్న సంస్థ లో వుద్యోగం వుండే సరికి నేను పనికి వచ్చే వాడి లాగా కనపడి కలిసినప్పుడు నాతో స్నేహం గా మాట్లాడే వారు. ఆయనా చలం అభిమానే అయితేనేం? చలం చుట్టూ చేరిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళలాగా కనపడ్డారు.


ప్రయోజకుల్ని చలం ఎందుకు పట్టించుకుంటాడూ? అటువంటి వాళ్ళకు చలం అండ ఎందుకూ? అవసరమైన నమ్మకాల్ని ధరించి, ఎగరెయ్యాల్సిన గొడుగులు ఎగరేసి, పరిధుల్లోనే వున్నామని నమ్మించి, చివరకు మీతోనే పోటి పడి, మీ కుర్చీ ని లాక్కుపోయే వారు కారా? చలం ఎందుకూ? చలం రచనల లోని కళా విజృంభణ నూ వైదగ్ధ్యాన్ని విశ్లేషిస్తూ పేరు సంపాయించేవారు కదా! ఆయనా చలం రచనల్లోని సాహితి విలువల్ని చాలా మంది కంటే బాగా చెప్పగలడు. అయితేనేం? ఆ పుస్తకాల్లోని మనుష్యులు కనపడ్డప్పుడు మొత్తం గా కాక పోయినా కొన్ని పోలికలతో అంతటి చలం అభిమానీ మా అమ్మమ్మ లాగే మాట్లాడారు.

ఆయనే కాదు చాలా మంది అంతే. ఆ అభిప్రాయం చలం నీడన విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ మీదే కాదు. కాస్త పరిధి విస్తరించి, కాసిని మాటలు నేర్చుకునీ, రంగు రంగుల ఆదర్శాలు చేర్చుకునీ చలానికి చలం నాయకలక్కూడా వర్తింపచేస్తారు.

స్వేచ్హ కోసం పోరాడాడు చలం అంటునే అది పరిష్కారం కాదు అంటారు. ఎంత గొప్ప రచన అంటూనే 'అయినా చివరికేమయింది ఆమె, ఎన్ని కష్టాలు, చలం అసలు ప్రాక్టికల్ కాదండి.' అదీ వరుస. 'వాల్లేమి సాదించారు, ఓడిపోయారు.పారిపోయారు. నిలబడలేకపోయారు. ' అని తీర్పు.

ఇట్లా మాట్లాడిన వీళ్ళే తమ రచనల్లో, వుపన్యాసాల్లో సమాజం అస్తవ్యస్తవ్యం గా వుంది, సమూలం గా మార్పు రావాలని అంటారు. అంత చండాలపు సమాజం లో చలమూ, చలం నాయికలు రాణించలేక పోయరని, అది ఓటమి అని తీర్పు చెపుతున్నప్పుడు , ఆ సమాజపు విలువలతోనే, కళ్ళతోనే చలాన్ని చూస్తున్నామని మర్చిపోతారు ఆ అస్తవ్యస్త సమాజం లో రాణించలేక పోయరని అంటారు.

ఈ సంఘం లో రాణించటమంటే ఈ విమర్శకుల దృష్టి లో ఆ పాత్రలు ఎట్లా వుండాలని కోరుకుంటున్నారో ఊహించటం కష్టం కాదు. ఒక విమర్శకుడు అననే అన్నాడు... " 'కనీసం ఆ రాజేశ్వరి మరీ ఆ జట్కా బండి, మొరటు సాయిబు తో కాకుండా కారున్న ముసల్మాన్ తో లేచిపోయి పెళ్ళి చేసుకుని సుఖం గా కాపురం చేసినట్లు రాస్తే చలం సొమ్మేం పోయింది" ' అని. దాదాపు గా అందరి దృష్టి లో ధ్యేయం అదే.

సరే - మొదటి మొగుడ్ని వదిలేయటం విప్లవమే కాని! ఆ కుర్ర వెధవ తో ప్రేమలేమిటి? అని మరో విమర్శ... ఆ మొదటి మొగుడు బాధలు పెట్టక పోయినా (పోయినా ఏమిటి పెట్టలేదు) వదిలేయటం తో వచ్చిన విప్లవం మూడో మొగుడి తో దెబ్బ తింటోంది... ఇట్లా ఎన్నో మొగుడి తో మొదలు అయ్యి స్వేచ్హ ఎన్నో మొగుడి దగ్గర ఆగిపోయిందో లెక్కలు. పూర్వం స్త్రీలకు విద్య ఎంత వరకు అవసరమో, రవిక చేతులు ఎంత పొడుగ్గా లేక ఎంత పొట్టిగా వుంటే సంప్రదాయమో లెక్క వేసినట్లు ఇంత గందర గోళం ఎందుకు వస్తుందంటే ఏ సిద్ధాంతాలు మాట్లాడినా స్త్రీ పురుష సంబంధాలలో స్వేచ్హ అనగానే, ఇవాల్టి వీరులలో నుంచి మన తాతయ్య లు అమ్మమ్మలే మాట్లాడతారు. జీవితం మీద అధికారాన్ని దేవుడి దగ్గర నుంచి లాక్కొని ప్రభుత్వం చేతిలో పెట్టీ, ప్రారబ్ధాన్ని కాకుండా లీడర్ ని తిట్టూకుంటు బతకటానికి ఒప్పుకుంటారు.


కానీ జీవితాన్ని తన చేతులలోకి తీసుకుని, ఆ బాధ్యతేదో తనే మోస్తానని ఇంకెవర్నో తిట్టుకుంటు బతకటం ఇష్టం లేదని ఎవరైనా అంటే, అటువంటి వాడి మీద అటు దేవుడి భక్తులు, ఇటు గవర్న్మెంట్ భక్తులు కత్తులు దూస్తారు...

పూర్వం చెడి పోవటమంటే మోక్షానికి పనికి రాకుండా పోవటం...ఇప్పుడేమో గవర్న్మెంట్ పరిధి లో లేక పోవటం... చలం స్త్రీలు, చలము నిజం గా ఓడిపోయి, నిలభడలేక, పారిపోయి, పనికిమాలిన వాళ్ళేనా? చూద్దాము...

రత్నమ్మ:
బంగారమ్మ, చి.సుందరమ్మ, రమణ లు ఏమి చేసేరో తెలియదు కాని మన చలాన్ని ఆవిష్కరించింది రత్నమ్మ. మిగిలిన కవులకు కలలును, కన్నీళ్ళను, కవిత్వానికి ప్రేరణ గా ఇచ్చినా చలానికి మాత్రం రత్నమ్మ శరీరాన్ని, హృదయాన్ని వీటి సంబంధాన్ని పరిచయం చేసింది. కాని ఆమె జీవితం లో చలం ప్రభావం వుండే ఆస్కారం తక్కువ. తర్వాత పెళ్ళి చేసుకుంది, చచ్చిపోయిందీ -- వచ్చిన పని ఐపోయినట్లు.

డా. వొయ్యి, రంగనాయకమ్మ గార్లు.

చలం నాయికలు వీళ్ళు ఇద్దరూ. డా. వొయ్యి చలానికి వదినె గారు. భార్య రంగనాయకమ్మ గారికి అక్క. వీళ్ళు ఇద్దరు చలం ప్రభావం లో పూర్తి గా మునిగిపోయిన వాళ్ళు. చిన్న తమ్ముళ్ళూ, చెల్లెళ్ళు నోరు తిరగక వొదినె అని పిలవలేక వొయ్యి అని పిలుస్తుంటే ఆ పేరే ఆమె కు ఖాయం అయ్యింది. ఆమె బాల్య వితంతువు. చెల్లెలు రంగనాయకమ్మ కు చలం తో పెళ్ళి అయ్యాక మొదలయిన పరిచయం ఆయన సాహచర్యం ఆ కుటుంబాన్నీ, సంప్రదాయాన్ని ధిక్కరించి చదువుకుని డాక్టరయ్యింది. "అంత గొప్ప స్త్రీ ని నేనెక్కడ చూడలేదు " అంటాడు చలం. చలం భావాల్ని ఏ ఘర్షణ లేకుండా అతి సులభం గా ఆచరించ గలిగింది. సంఘం కోసం ఏ మర్యాద, ముసుగులు ఆమె వేసుకోలేదు. సంఘమే తన అవసరానికి ఆమె దగ్గరకు వచ్చి బాధల్నించి తప్పించమని అడిగింది. కాని వొయ్యి ఎవ్వరి మీదా ఆధార పడలేదు. " రక్షణ మందిరం" ఆలోచన చలానిది. కాని ఆయనెక్కడెక్కడో వుద్యోగాలు చేస్తూ వూళ్ళు మారుతుంటే రక్షణ మందిరాన్ని నడిపింది వొయ్యి రంగనాయకమ్మ గార్లే. ఏ స్త్రీ కు ఎటువంటి రక్షణ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా వెంటనే రంగం లోకి దూకే వాళ్ళు. ఎంతటి సాహసానికి తగ్గే వాళ్ళు కాదు. ఏ అధికారానికి భయపడలేదు. అట్లా నడిపేరు ఆ రక్షణా మందిరాన్ని. వొయ్యి లాంటి స్త్రీ లను నిందించిన వాళ్ళే తమ కుటుంబ స్త్రీ లు హృదయాదేశాల వల్ల ఏ చిక్కులలో పడితే, రక్షించమని ఆ వొయ్యి దగ్గరకే చేరే వారు. వాళ్ళను కాపాడి సహాయం చేసి, ధైర్యం చెప్పి, మళ్ళీ మాములు మనుష్యులను చేసి తిరిగి సంఘం లోకి పంపే వారు డా. వొయ్యి. చలం అంతటి సంక్లిష్టమైన వ్యక్తిత్వం వున్న వాడిని అర్ధం చేసుకున్న స్త్రీ ఆమె. చివరకు చలం భగావాన్ మీద విశ్వాసాన్ని పెంచుకుంటుంటే " ఆ గుర్రానికి తోక వుంటే దాని ఈగలను తోలుకుంటుంది కాని మీ మీద వాలే ఈగలను ఎందుకు తోలుతుంది " అనగలిగిన వ్యక్తిత్వం ఆమెది.

రంగనాయకమ్మ గారు:
చలం భార్య. పెళ్ళయ్యాక చలం ప్రోధ్బలం మీద చదువుకున్నారు. మాములప్పుడు చలాన్ని ఒరెయ్ విఘ్నేశ్వరా అని పిలిచి కోపమొచ్చినప్పుడు ఓరి దరిద్రుడా అని సంభోదించగలిగిన స్త్రీ. చలం మూలం గా వచ్చిన కష్టాల్ని ఎక్కువగా భరించింది ఈమే నంటారు సౌరిస్ గారు. రంగనాయకమ్మ గారిని తలుచుకున్నప్పుడల్లా హనుమయ్య గారి గీతం గుర్తు వస్తుంది. " పసిపాపలకు పాలను రసలుబ్ధులకు పానకాన్ని ఇచ్చే జీవితం సోక్రటీస్ లాంటి వాడికే విష పాత్ర ని ఇచ్చి చాలెంజ్ చేస్తుందని". చలం అనే విష పాత్ర ను రంగనాయకమ్మ గారికి ఇచ్చి జీవితం చాలెంజ్ చేసింది. ఆ సవాల్ ను ఆమె తీసుకున్నారు. మోయలేక అప్పుడు అప్పుడు విసుక్కున్నా చలం స్నేహితుల భార్యల్లా వదిలి పెట్టి పారిపోలేదు. " ఆ నీకేమి తెలుసు నిన్న పుట్టేవు.. వాళ్ళెన్ని బాధలు పడ్డారో... మా ఇంటి పక్క గదిలోనే వుండేదామె... నాకు తెలుసు అసలు సంగతి" అన్నడొక న్యాయ మూర్తి, నా స్నేహితుడి మామ గారు, చలం అభిమాని. నిజమే -- చలం జీవితం లోని స్త్రీ లే కాదు రచనల్లోని నాయిక లు మాములు మనుష్యులకంటే ఎక్కువే బాధ లు పడ్డారు. కాని అవేవి వాళ్ళను గాయం చెయ్యలేదు. వంకర్లు తిప్పలేదు. రహస్యం లో దాక్కునేట్లు చెయ్యలేదు. సాధారుణులను వదిలేసినా సంఘ సంస్కర్తలు గా పేరు పొందిన వారు ప్రవేటు మాటల్లో ఎంత నిరాశ నింపి మాట్లాడేరో చివరకు. జీవిత చరిత్రలలో చివరి రోజులు వుండవు. వున్నా నిజం రాయరు. ఆ రచనలంతటి కాల్పానిక సాహిత్యం ఇంకోటి వుండదు. చివరి రోజులలో సినిక్స్ గా మారిపోయి చేదు పులుముతూ ఎందరు కన్ను మూశారో...


చలం స్త్రీలు,చలం ఎప్పుడు వ్చిషం గామార లేదు. మనుష్యులను ప్రేమిస్తూనే వున్నరు. జీవితాన్ని శ్రద్ధ గా ఆరాధిస్తూనే వున్నారు. కష్టాలు ఎంత లోతు గా గుండె ను చీలిస్తే అంత లోతు గాను. విశాలం గాను వాళ్ళ ధృక్పధం మారింది. కాని ఇరుకై పోలేదు. కష్టాలు రానిదెవ్వరికి? వాళ్ళు ఆ తరువాత సుఖం గా బతికేరు. లోకం జేజే లు పలికింది అని రాసినా అటువంటిది ఆశించినా పసితనం అవుతుంది. బాధలు పడటం తప్పూ కాదు నేరము కాదు ... అవివేకము కాదు. వాటి లోనుంచి గాయ పడకుండా వస్తారు వున్నతులు. ఆ సంస్కారం ముఖ్యం కాదా....!

లీల గారు:

చలం రచనలు చదివి ఆయన్ని ప్రేమించి జీవితం లో ప్రవేశించిన మరో స్త్రీ లీల గారు. ఆమె వూర్వశి అయ్యారో లేదో తెలియదు కాని "పూరూరవ" కు ఆధారమైనందుకు మనం ఆమె కు రుణ పడి వుండాలి. బతుకు చివరి దాకా చలం తో నడవాలనే కోర్కె తో సహచర్యం మొదలు పెట్టినా ఆయనంత వేగం గా పరిగెత్త లేక ఆగిపోయారు పారిపోలేదు...


తర్వాత చలం రచనల్లోని నాయికలు అనగానే గుర్తు వచ్చేది -- రాజేస్వరి, అరుణ. చలం పాత్రలన్ని కాల్పానికం, బయటెక్కడ కనపడరు అంటారు కాని -- నేనే అరుణ ను తెలుసా అని గర్వం గా చెప్పుకున్న స్త్రీలను నా చిన్ని జీవితానికి నేనే ఇద్దరు కాదు ముగ్గురు స్త్రీలను చూశాను. రాజేశ్వరి మీద తీర్పు చెప్పేటంత చివరిదాకా ఆమె జీవితం లేదు మైదానం లో.... ఆ రచన కున్న నేపధ్యం కూడా విశేషమయినదే. ఆంధ్రా యూనివర్సిటి నవలల పోటీ పెడ్తోందనీ, ఫలానా వాళ్ళు జడ్జీలనీ, ఫలానా రచయతలు పోటీ కి దిగేరనీ ఒక మిత్రుడొచ్చి చలం తో చెప్పాడు. చలానికి ఒళ్ళు మండింది. వీళ్ళే కదా తన రచనలు చదవొద్దని ప్రచారం చేసేరు ఇన్నాళ్ళు... ఇప్పుడు వీళ్ళ చేతనే చదివింపచేసి నిద్రపట్టకుండా చేయాలనుకున్నాడు... వుత్త లైంగిక వ్యవహారం తో షాక్ తినిపించాలని రాయటం మొదలు పెట్టేడు. గడువు ఎక్కువ లేదు, రాసింది తిరిగి చూసుకునే వ్యవధి లేదు. రాసిందాన్ని అట్లాగే చుట్ట చుట్టి పోస్ట్ కు పంపి తిక్క కుదిర్చాను అని గంతులేస్తూ కూర్చున్నాడు. బహుమతిని ఎటూ ఆశించలేదు కాని -- సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారు దాన్ని వుత్తమ రచన గా అభిప్రాయ పడ్డారని తెలిసి ఆశ్చర్య పడ్డాడు. ఆయన అభిప్రాయం అట్లా వున్నా దానికి బహుమతి ఇచ్చే ధైర్యం జడ్జీలకు లేదు. చలం అప్పుడు వెలి. బహుమతి ఇస్తే వాళ్ళను వెలివేస్తారేమో ఇవ్వక పోతే రాధా క్రిష్ణన్ గారిని ధిక్కరించినట్లవుతుంది. అందుకని రాధాక్రిష్ణన్ గారికి నచ్చ చెప్పి ప్రధమ బహుమతిని ఏ ఒక్కరికో ఇవ్వకుండా రెండు గా చీల్చి ఇద్దరు రచయతలకిచ్చి గండం గట్టెక్కామని స్థిమిత పడ్డారు.

తిరిగొచ్చాక స్థిమితం గా చదివిన చలమే ఆశ్చర్య పోయాడు తన రచన చూసి. ఉద్దేశించిన పరిధులు దాటి ఎంత వున్నత ప్రదేశాలకు వెళ్ళిందో గమనించి. ఒక విమర్శకుడన్నాడు -- సంఘ మర్యాదలు దాటిన స్త్రీ పడే బాధలు చెప్పి హెచ్చరించటానికి ఆ రచన చలం చేసేడని.

రాజేశ్వరి నిలబడలేక పోయిందని ఓడిపోయినట్లేనని మరొక విమర్శ. మొదటి పేరా ఒక్కటి చదివితే చాలు విమర్శకులు రచనకెంత దూరం గా వున్నారో తెలుస్తుంది.
సాంప్రదాయ కుటుంబం లోని బ్రాహ్మణ స్త్రీ కుటుంబాన్ని వదిలి ఇద్దరు ముస్లిం ప్రియులతో వూరి బయట బతికి ఒక ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటే రెండో ప్రియుడితో జైలు జీవితం కూడా అనుభవిస్తుంది. బయటకు వచ్చాక చూడ వచ్చిన స్నేహితురాలితో గడిచిన జీవితమంతా చాలా స్థిమితం గా పవిత్రమైన తపోసాధనను వర్ణించినట్లు చెపుతుంది. ఆ జీవితం ఈశ్వరుడికెత్తిన మంగళహారతి వలే తోస్తుందామెకు వెనక్కి చూసుకుంటే. ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేదు. నిందలు వేస్తున్న వాళ్ళమీద కనీసం ద్వేషం కూడా వుండదు, పైగా జాలి పడుతుంది. " ఇటువంటి అనుభవం లేక పాపం ఈ మనుష్యులు ఆ చిన్ని కంతల్లోనించి తప్ప జీవితం చూడలేరు కదా" అన్నట్లు.
అటువంటి రాజేశ్వరి ఎవరికి భయపడి పారిపోతుంది????

ఆరుణ:

అరుణ జీవితం లో ఏదో ఒక చివరకొచ్చిందనే అనుమానం వచ్చే అవకాశమే లేదు.

మూసి వున్న తలుపులలోనుంచి నాయకుడి మేడ మీద గదిలోకి వచ్చిన అరుణ అట్లాగే ఒక రాత్రి మాయమయిపోతుంది. ఆమె ఓడి పోయిందనో ఆత్మహత్య చేసుకుందనో అనుకోవటానికి ఆధారమే లేదు. పైగా దానికి విరుద్ధం గా " కానీ ఈ అంధకారం లో ఆకాశం కొంచం గా తెరుచుకుంది. కొత్త విధం ఆనందానికి కొత్త ద్వారం కొంచం తెరిచారు. ప్రయత్నిస్తాను. ఈ శరీరాన్ని, ఈ మొద్దుని, భారాన్ని అతిక్రమించి ఎగరటానికి చూస్తాను, నేనేమి చెప్పలేను" అని సృష్టంగా చెపుతుంది. చివర "నేనింతవరకు ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పుడు తలుచుకు చూసుకుంటే! నా హృదయం లోగొప్ప ప్రేమ వుంది. ప్రేమించాలనే ఆశ అపారంగా వుంది." అంటుంది. "సునో ముసాఫిర్ భాజతు ఢంకా" అరుణకు వినబడుతోంది. అరుణ కోసమే గంటలు మోగుతున్నాయి. భద్రతలను, భయల్నీ కాపాడుకుంటూ విలువల్ని లెక్క కట్టుకుంటూ చేసే ప్రయాణం కాదది. అవన్ని వూహాత్మకమని ఎప్పుడో తేలిపోయింది. ధ్యేయాలన్ని బోలువనీ తెలిసి పోయింది. కొత్త దాని కోసం ఎగరాలి తప్పదు. ఆ టేకాఫ్ పాయింట్ అరుణ. ఆమె ఏదో అయ్యిందని తీర్పు చెప్పే అవకాశమే లేదు. రచయత అంతకు ముందు " ఏమీ అక్కర్లేకుండా అవసరం లేకుండా లోకాన్ని చూడటం గొప్ప అనుభవం గావును!" అంటూ సూచిస్తాడు. అరుణ చలమే అందుకే చలం అరుణాచలం అయ్యాడు జీవితంలో వెంటనే.

చలం రచనల్నీ 'సమస్యా-పరిష్కారం' అనే చట్రంలోంచి చూడటం మూలం గా వస్తున్న అనర్ధాలు ఇవి. ఈ తీర్పులు. నిర్మాణాత్మక రచన లు చలం చేయలేదని, అవన్నీ సృజనాత్మక రచనలనీ గుర్తు పెట్టుకుంటే తొందరపడి చెప్పే తీర్పులు ఆగిపోతాయి.

" ఇంకా ఏం చలం! " అనటం అర్ధ దశాబ్ధం గా ఒక ఫ్యాషన్. చలం వెనక్కి పోయాడు కాని మేము ముందుకు పోతున్నామని ధ్వనింపచేస్తూ అట్లా మాట్లాడే వాళ్ళు మరీ అంత కొత్తది కాకపోయినా, కాస్త కొత్త తోవ తొక్కాలనుకున్నప్పుడు ధైర్యానికి చలం వైపే చూసే వాళ్ళు. అరుణాచల యాత్రే చేయాల్సి వచ్చేది. ఇక దగ్గరి స్త్రీలు నీతి సంబంధమైన చిక్కులలో పడితే చెప్పనవసరం లేదు. చలం నీడే వాళ్ళకు గూడు అయ్యింది. పేర్లు చెపితే ఆశ్చర్య పోతారు. " నాకా స్త్రీ అంటే ఇష్టం. స్నేహం కుదిరేట్లు చేస్తే ఈశ్వరుడిని నమ్ముతాను" అన్న ప్రముఖ నాస్తికుడు ఇంకా బతికే వున్నాడు. అరుణా చలాన్ని చిన్నబుచ్చటం ఆయన రాజకీయ విధానం.

అంతకు పూర్వమూ అంతే. ఏదో ఒక విపత్తులో సంఘానికి భయపడి చలం రక్షణలో ధైర్యం పుంజుకుని బయటికొచ్చి " చలం మమ్ములను నాశనం చేయబొయ్యాడు . తెలివిగల వాళ్ళము కాబట్టి మేం బయటపడ్దం" అనే వాళ్ళు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చలాన్ని మేము కాపాడాం అనే మాటలొచ్చాయి. విప్లవమే -- ఏదో ఒక రకం

చలాన్ని గురించి మాట్లాడేటప్పుడు అందరు మరిచిపోయే స్త్రీ -- సౌరిస్ గారు. ఆయన పెద్ద కూతురు. ఆయన కోసమే పుట్టేననే సౌరిస్ గారు ఆ అగ్నిపర్వతానికి స్నేహాన్ని కంపెనీ ఇవ్వటమే కాక టేకాఫ్ పాయింట్ లో ముందు నడిచి తోవ చూపించారు. ఆయనకే కాదు ఇప్పటికీ తోవ తెలియని వాళ్ళకు చూపిస్తూనే వున్నారు. చలం మార్గం ఆత్మహత్యా సదృశ్యమో కాదో భీంలీ వెళితే కనిపిస్తుంది.

చివరగా -- చలం ప్రేమ వ్యవహారాలు అందరికి తెలిసిందే. స్త్రీ లోలుడు అని అనటం అంత వింతేమి కాదు. కాని మొదటి సారి ఆయనను చూసినప్పుడు లీల గారి తల్లి అన్నారట " ఆయనకసలు ఏ స్త్రీ అయినా అవసరమా?" అని. లీలగారు తరువాత ఆ అభిప్రాయాన్ని సమర్ధిస్తారు. - అనుభవం తో. ఇది విశేషమైన దృక్పధం.

విశ్లేషకులు రంగం లోకి దూకవచ్చు.

Sunday, March 1, 2009

చలమెవ్వరని నువ్వు అడగబోకమ్మా
నీ గుండె కథ అతను....
నీ మనసు వెత అతను...
ఒంటరైన రాత్రి లో
కన్నీటి సెలయేటి లో
నీకోసం నేనున్నానని
గొంతు కలిపిన స్త్రీవాది
కాదు కాదు కానే కాదు
మానవతా వాది...

Friday, February 27, 2009

చలం గురించి చెప్పటం అంటే మనలోని ఒక కోణాన్ని గురించి చెప్పినట్లే... కాని ఆ కోణఁ మాత్రమె చలం కాదు.. అటువంటి అనేక లక్షల కోణాలను తనలో ఇముడ్చుకున్న ఒక అధ్బుత వ్యక్తి, ఒక సాముహిక శక్తి... ఆయన ఒక్కడే ఈ సమాజపు విలువలను వేయి గొంతుకలతో ప్రశ్నించగల సామర్ధ్యుడు.. అందిన చొప్పదంటు సమాధానాలతో తృప్తి పడక నిరంతరం వెతికిన ఒక అన్వేషి... ఒక ఋషి.... ఒక తాత్విక వాది.... ఆర్య సమాజం లో తిరిగినా, దానినుంచి బయటకు వచ్చి వాటి మూలాలనే ప్రశ్నించినా, మనసుకు నిజమని నమ్మిన సిద్ధాంతం ఆచరించగలిగినా నమ్మని రోజు దానిని ధైర్యం గా ఒప్పుకో కలిగినా .. నిక్ష్పక్ష పాతం గా విమర్శించ కలిగినా ఆ విమర్శను తీసుకో కలిగినా ఒక్కడే ఆనాటికి ఈనాటికి... అది మన చలం.. ఆయన కు శత సహస్ర నమస్సులతో ఆయన రచనలను ఆయన ఆలోచనలనూ ఈ తరం వారికి అందించ గలిగితే ఈ నా ప్రయత్నం సఫలమని అనుకుంటున్నాను..