Thursday, January 21, 2010

మల్లెపూలోయ్ మల్లె పూలు..




చలం గారి పుస్తకాలను తెలియని వారికి పరిచయం చెయ్యాలని, తెలిసిన వారికి మరొక సారి గుర్తు చేయాలని ఈ బ్లాగ్ కాని, చలం గారి గురించి పరిచయ వాక్యాలు రాయాలని..... రాయ వలసిన అవసరం వుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు.. ఇప్పుడు కూడా అనుకోవటం లేదు.

కాని కొన్ని రోజులుంటాయి, నువ్వేమిటో నీకే తెలియక నీ నువ్వు ఇంకొకరి గా మారి పోయి రాధ కృష్ణుడి లో ప్రేమ తో, మీరా కృష్ణయ్య తో రాగం లో..... సైంటిస్ట్ తన ప్రయోగం తో... చిరు వెలుగు వుదయం తో... సాయంసధ్య నారింజ రంగు నీలాకాశం తో... మనసు పలికే వేణు గానం తో... కలిసి పోయి రెండూ వేరు వేరు కాదని ఏకత్వం తోచే క్షణాలు. ఆ క్షణాలే ఆ రోజులను, ఆ రోజులే జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి జీవితానికి కొత్త విలువలను కొత్త అర్ధాలను సూచిస్తాయి.. జీవిత పధాన నడిపించే వేగు చుక్క లా తోడుంటాయి.

అలాంటి రోజులు, క్షణాలు నాకు చలం ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు తోస్తాయి.. నన్ను నేను మర్చిఫొయి.. వుహూ ఆ పదం కాదు నా అనే అస్తిత్వం ఇంక అక్కడ వుండదు మొత్తానికి నేనే పూర్తి గా ఆ పుస్తకాలలోని అనుభూతి నైపోతాను... వరుసగా..... వేసవి వుదయాలు, వొంటరి వర్షపు రాత్రులు, బద్ధకం గా వూపిరి పోసుకుంటున్న వేసవి సాయింత్రాలలో మెరిసిన మల్లె నవ్వులు, మూగిన జ్ఞాపకాల చీకటి రాత్రు ల లో తోడైన వాన చుక్కల కబుర్లు.....తిని పోసిన చెరుకుప్పల మధ్యన విశ్రాంతి తీసుకుంటూ ఎదురు గా మధ్యాన్నపు ఎండ గాలి తో కలిసి నది ని అవిశ్రాంతం చేసే కల్లోల్లాన్ని చూసే రోజులు.... ఎన్నని...... మనం వున్నామని మర్చిపోయి ఆ క్షణాలలో కి వెళి పోతాం.

ఆయన ప్రేమలేఖలను ప్రత్యక్షం గా ఫస్ట్ హేండ్ ఎక్స్పీరియన్స్ అంటారే అలా ఆ లేఖలలో రెండూ పక్కలా పాఠకుడి గా, ఆ వుత్తరం లో ఒక భాగం గా ఫీల్ చేయించగలగటం ఆయన కే చెల్లు. అలాంటి లేఖలను ఈ రోజు చాలా చాలా రోజు ల తరువాత చదువుతున్నా. మన అందరికి కొన్ని చిరాకు పెట్టే రోజులు, కొన్ని అకారణం గా సంతోష పెట్టే రోజులు, కొన్ని విసుగు ను కోపాన్ని తెచ్చే రోజులు వుంటాయి కదా, ఈ మాటే అంటే నా స్నేహితురాలొక ఆమె మాకు అలా వుండటానికి ఒక అర్ధ వంతమయిన కారణముంటుంది, కారణం లేకుండా అలా వుండటానికి మాకు వెర్రీ కాదు, చలం అభిమానులమూ కాదు రెండూ దరి దాపుల ఒక్కటే లే అని పరాచికాలాడింది. నిజానికి అది పరాచికమే కాదు చాలా మంది దృష్టి లో నిజం.... కాని వుంటాయి కొన్ని రోజు లు నీ ఆత్మ తనలోకి తనే చూసి గొణుక్కుంటున్న గోలల చిరాకు రోజులు, వుదయపు వెలుగు కొమ్మ కొమ్మ ను పలకరించి కల కల లాడే చిన్ని పిట్టలను చూసి నీతో సంభందం లేకుండా అనంత వాయు గానాలలో లీనమైన నీ ఆత్మ చేసే ఆనందపు సందడుల కాలాలు, ఆషాడ రాత్రి కురిసే వాన కు ముడుచుకున్న దేహం తో ఆత్మ కలిసి, గచ్చు మీద చిందులు తొక్కి, పిల్ల కాలువలై ఇసుకు తిన్నెల మేటల మధ్య సాగర కాంతుడి తో కలవాలని వడి గా మొడలెట్టి బురద లో ఇంకే నీటిని చూసి కన్నీటి పాలయ్యే రాత్రులు.. వుంటాయి వుంటాయి అన్ని అర్ధవంతాలే కానక్కరలేదు...

అలాంటి ఒక చలి రాత్రి ప్రేమ లేఖలు చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన మల్లెపూలు కవిత చదువుతూ కళ్ళు తెరిచి కలల లోకి వెళ్ళి పోయాను.. ఆ కవిత ను మీతో పంచుకుందామని దానికి ముందు ఇంత పరిచయమిచ్చేను.
ఇదుగో ఆ కవిత...



మల్లెపూలు, తెల్లని మల్లెపూలు!
విచ్చిన మల్లెపూలు!!
ఆ పరిమళం నాకిచ్చే సందేశం
యే మాటలతో తెలపగలను.!

సాయింత్రాలు స్నేహానికి
చల్లని శాంతినిచ్చే మల్లెపూలు.

అర్ధరాత్రులు విచ్చి
జుట్టు పరిమళంతో కలిసి
నిద్ర లేపి
రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు

వొళ్ళమధ్య చేతులమధ్య
నలిగి నశించిన పిచ్చి మల్లెపూలు

రోషాలూ నవ్వులూ
తీవ్రమయిన కోర్కెలతో
తపించి వాడిపోయిన పెద్ద మల్లెపూలు

సన్నని వెన్నెట్లో
ప్రియురాలి నుదిటి కన్న తెల్లగా
యేమి చెయ్యాలో తెలీని ఆనందంతో
గుండెపట్టి చీలికలు చేశే మల్లెపూలు

తెల్లారకట్ట లేచి చూసినా
యింకా కొత్త పరిమళాలతో
రాత్రి జ్ఞాపకాల తో
ప్రశ్నించే మల్లెపూలు

ఒక్క స్వర్గం లో తప్ప
ఇలాంటి వెలుగు తెలుపు
లేదేమో - అనిపించే మల్లెపూలు

అలిసి నిద్రించే రసికత్వానికి
జీవనమిచ్చే ఉదయపు పూలు
రాత్రి సుందర స్వప్నానికి సాక్షులు గా
అవి మాత్రమే మిగిలిన
నా ఆప్తులు!
మల్లెపూలు.... !!!

34 comments:

  1. కవిత రమణీయంగా ఉంది. Poem is lovely.

    ReplyDelete
  2. ఏమి రాయాలండి!! వీటిపై వ్యాఖ్య రాయగలిగే సత్తా ఉండాలంటే నేనే చలం ని కాగలగాలి
    ఆయన గొప్పతనం ఏమిటంటే ఎంత చక్కగా సౌందర్యాన్ని ,అంటే భగవంతుడేగా (సుందరం ..) ఆస్వాదించి ఆరాధించ గలరో అంత చక్కగా రాయగలరు. అమ్మ సరస్వతి దేవి దగ్గర నుంచి ఒక చుక్క ఎక్కువ క్షీరం తాగారు.
    మీరూ చలం గూర్చి, కిట్టయ్య గూర్చి రాసేటప్పుడు అద్భుతం గా రాస్తారు. .వాళ్ళే రాయిస్తారు...

    ReplyDelete
  3. మీరు ఈ కవితని ఇప్పుడు గుర్తుచేసి చలికాలంలో మల్లెలని పూయించారు కదండి భావనగారు.

    ReplyDelete
  4. ఎంతో చక్కగా ప్రెజెంట్ చేసారండి, ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

    ReplyDelete
  5. నావి కూడా మైత్రేయి మాటలే. మాటలు రావు. కళ్ళు తెరిచి కలల్లోకి వెళ్లిపోవటం తప్ప.

    ReplyDelete
  6. భావనగారు మల్లెపూలోయ్ మల్లెపూలు...అని మీరు రాసాక నా పసిడి మల్లెమొగ్గని మీ చెంతనే విరబూయాలి అనిపించింది... ఆమోదిస్తారు కదూ?

    "మల్లెనమ్మా నే మల్లెనే
    నన్ను చూసిన మనసు ఝల్లనే
    పువ్వునై విచ్చుకునే మొగ్గనే
    మురిపెంతో మిమ్ము అలరింతునే
    స్వఛ్ఛతకి నేను మారుపేరునే
    వడులుతూ వాసనలని వెదజల్లుదునే
    పూజకైనా పులకింతకైనా నేనుందునే
    మగువల మురిపాల చెలినే
    మల్లెనమ్మ నే మల్లెనే"

    ReplyDelete
  7. @ప్రవీణ్: అవునండి నాకు కూడా ఇష్టమైన కవిత.

    @మైత్రేయి: అవును సౌందర్యాన్ని ఆరాధించి దానిని తిరిగి మనకు పుస్తకాలలో అందించిన గొప్ప వ్యక్తి. ఆయన కవిత నైనా కధ ఐన చదివి అనుభవించటంమే వ్యాఖ్య లేమి లేవు. :-)
    అవును మైత్రేయి కిట్టయ్య చలం వీళ్ళ గురించి ఆలోచనే అనంతమైన ప్రేమ ను గుండె లోకి తెస్తుంది. మీరన్నా ఆ వూహే ( వాళ్ళే రాయించుతారని) అధ్బుతం గా వుంది. అంత అదృష్టమా..

    ReplyDelete
  8. @ప్రేరణ: అమ్మయ్య మీకు అలానే అనిపించిందా మల్లెలు పూసినట్ళు. అమెరికా లో ఏ కాలం లో నయినా మల్లెలు కావాలంటే ఇవి చదువు కోవటమే. :-(

    @శృజన: ధన్యవాదాలు. అవును మల్లెపూల ఫొటో లంటే నాకు ఇష్టం. వీలైనన్ని దాచుకుంటాను.

    ReplyDelete
  9. @కల్పన: కళ్ళు తెరిచి కలలు కనటమో మనసు తోటి ఆ మల్లెల వాసన చూడటం మీకు కూడా అలవాటేనా ఐతే. :-)

    @పద్మార్పిత: బలే వుంది మల్లెల చిరు కవిత. పద్మాల రాణి కి మల్లె మనసు తెలిసిందే .... అవును స్వచ్చత కు మారు పేరో, కాంక్షల కాణాచో కాని ఈ మల్లె చేసే మాయ ఇంత అంతా కాదు కదా.

    ReplyDelete
  10. Bhavana garu mee blog baavundi..mee thinking baavundi

    ReplyDelete
  11. మనోజ్ఞMarch 4, 2010 at 8:17 AM

    మల్లెల కవిత నేను ఇంతకు ముందు చదివాను.దీనిపై మీ భావన బాగుంది. నాకు ఓ బ్లాగు ఉంది. దయచేసి చూడగలరు.manognaseema.blogspot.com

    ReplyDelete
  12. మల్లెపూలు కవిత బావుంది,మీ భావ వ్యక్తీకరణ ఇంకా బావుంది, ఇంతకీ ఈ కవిత రాసింది ఎవరు??

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. @స్వామి గారు: ధన్యవాదాలు
    @మనోజ్న: ధన్యవాదాలు. తప్పకుండా మీ బ్లాగ్ చూస్తాను.
    @నీహారికా: వా వా... నేను ఏడుస్తున్నాను. రాసింది చలం అండి, ఈ బ్లాగ్ లో వీలైనంత వరకు చలం లేదా చలం గురించి న పోస్ట్ లే వుంటాయి అండి.

    ReplyDelete
  15. @మధు మోహన్ గారు: ఎక్కడో ఫ్రీ బ్లాగ్ పేజ్ లు దొరికే చోట తీసుకున్నా ఈ టెంప్లేట్ ను. గూగులమ్మ ను అడిగి చూడండి.
    @హను: ధన్యవాదాలు. అది చలం గారి గొప్పతనం, నాది కాదు.

    ReplyDelete
  16. అయ్యో అలా కాదండి మీకు నచ్చిన వేరే రచయిత ఎవరైన రాసిన కవితని ఇక్కడ reference ఇచ్చారేమో అనుకున్నాను,,ఇంత మంచి కవితని మీ blog ద్వార పరిచయం చేసినందుకు ధన్యవాదాలు...

    ReplyDelete
  17. @నీహరిక: మీరు బలేటోళ్ళే.. నేను సరదా గా "వా" అంటే మీరు దానికి explanation ఇస్తున్నారు. థ్యాంక్స్ అండీ నచ్చినందుకు.

    ReplyDelete
  18. ఈ కవితని మీరు చలం గారి ఏ రచన నుండి collect చేసారు??

    ReplyDelete
  19. ప్రేమ లేఖలు అనే పుస్తకం నుండి. కాని ఆయన అన్ని పుస్తకాలలో ని కవితలు ఆయన స్నేహితుడు,శిష్యుడు, అల్లుడు ఐన వజీర్ రెహ్మాన్ గారు కూర్చి ఒక సంకలనం చేసేరు "కవి చలం" అనే పేరు తో. ఆ పుస్తకం లో కూడా వుంటుంది ఈ కవిత.

    ReplyDelete
  20. భావన, చలం గారి నేల లోకి జొరబడి దేవులపల్లి తోట ఊసు చెప్పవచ్చా? :)

    "మల్లెనమ్మా మల్లెనే.." బావుంటుంది, విన్నావా? Smt. R. Vedavati Prabhakar Rao పాటల విభాగంలో ఉంది - చూడొకసారి http://surasa.net/music/lalita-gitalu/

    ReplyDelete
  21. భావన గారూ మీ బ్లాగ్స్ బావున్నాయి ముఖ్యంగా మన చలం బ్లాగ్ లో
    ఫాంట్ మోడల్ ఎంత బావుందో ...చదవడానికి కళ్ళకి హాయిగా వుంది
    అన్నీ చదివాక మళ్ళీ కామెంట్ రాస్తా .

    ReplyDelete
  22. భావన గారు ! మీరు రాసినది బాగుంది ,కాని చలం అంటే భావన సముదాయం అనీ అనుకుంటున్నారు ,అవి అన్నీ సముద్రం పైన కనిపించే అలల లాంటివి మాత్రమె.
    నిజమైన చలం ఆ అలల కింద వున్నా అగాధం ల కనిపిస్తారు,అర్ధం చేసుకోవడం కష్టం ,దయచేసి మన బావాల frame లో వారి భావాలను
    బంధించకండి.కేవలం చూసి చదివి ఆనందించండి............ అంతే నా సలహా ! ఎందుకంటే చలం అంటే అచలం నా భావన లో !
    వీలైతే వారి " భగవాన్ స్మృతులు" చదవగలరు.

    ReplyDelete
  23. @ఉష : విన్నాను చాలా బావుంది. మల్లెలంటేనే మరి దేవులపల్లి కదా.. లాలిత్యానికి భావుకతకు మల్లెలెంత ప్రసిద్దో తెలుగు నాట దెవులపల్లి అంతేగా.

    @ మల్లి: ధన్యవాదాలు నచ్చినందుకు.

    @ ఆనందమే బ్రహ్మప్ప : నేను కూడా :-)

    ReplyDelete
  24. @ సావిరహే :నేను ఇక్కడ సొంతం గా ఏమి రాయలేదండి. అన్ని చలం గారి భావాలే. అవును చలమంటే అచలం అని నా భావన కూడా. చలం గారి ప్రతి పుస్తకం నా దగ్గర వుంది. భగవాన్ స్మృతులు ఇంకా రమణాశ్రమం లేఖలు కూడా. ప్రతి అడుగులోను ఆయన ఆయన ఆలోచనలు వివరం గానే విశదీకరించారు, అర్ధం చేసుకోవటం చేసుకోక పోవటం అనేది మన ఇష్టం ఆ పైన.

    ReplyDelete
  25. హలో
    నేను ఇంకా ఈ పోస్టు పూర్తిగా చదవలేదు. చదవవలసినవి చాలా ఉన్నాయి కనుక, అన్నీ పూర్తిగా చదివిచెబుదామని.
    చలం రచనలు గూర్చి ఒక చిన్నపాటి రిసెర్చ్ లాంటిది చేస్తున్నాను. నేను చదివినవి నాకు తోచినట్లు విశ్లేషించడమే కాక , మిగతావారి సలహాలూ సూచనలూ కూడా జోడిస్తున్నాను. వాటితో ఏం చేయాలి అనుకుంటున్నానో ఇక్కడ చెప్పలేను కానీ, మీకు సహాయం చేసే ఉద్దేశ్యం ఉంటే , నాకు మెయిల్ ఇవ్వగలరు.
    మచ్చుకు.. కొన్నిరోజుల క్రితం నేను పుస్తకం.నెట్‍లో వ్రాసిన ఒక విశ్లేషణ చూడగలరు.

    ReplyDelete
  26. @ విప్లవ్ గారు: తప్పకుండా నండీ, నేను చేయగల సాయమేదైనా తప్పకుండా అడగండి. మీ విశ్లేషణ చదివేను. నాకు ఎందుకో కొంచం కష్టమనిపించింది అందుకే ఏమి కామెంటినట్లు లేను. మీకు చలానికి సంభందించి నేను చెయ్యగల సాయమేదైనా అది నాకు ముదావహమే. ఇంకా మహా మహులున్నారు ఆయన గురించి మాట్లాడటానికి. వాళ్ళందరి సాయం తీసుకుంటున్నారనే అనుకుంటున్నా. Good Luck and let me know what is the help I can do...I don't have your mail id so I am posting my comment here instead.

    ReplyDelete
  27. భావన గారు! సూపర్... ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది.
    మొదట మీరు రాసిన పరిచయానికే ముగ్ధుడునయ్యాను. ఎంత అందంగా రాసారో చెప్పలేను.
    <<<<<<<<<>>>>>>>>
    చాలా నచ్చింది.
    ఇక కవిత కూడా బాగా నచ్చింది. చలం ఇలా కూడా రాయగలడని నేను అనుకోలేదు.
    కవిత ఎంత బాగుందో మీ వివరణ అంతే బాగుంది.

    ReplyDelete
  28. "చలాన్ని చదవడం మంచిదెనా?"

    ఈ ప్రశ్ణ నిద్దుర పట్టనీయదు
    చివరికి తన "ప్రెమ లేఖలు"
    నా హస్తాల్లో నిద్దుర లెని నిశబ్ద రాథ్రుల్లొ
    ఇంతకీ
    దీనికి సమాదానం
    తెలియక మనసులొ అందోళన సంద్రాలు

    ReplyDelete
  29. భావనా
    మీ బ్లాగ్ బావుంది.డైరీ లో పేజీల్లా అందంగా ఉన్నాయి అక్షరాలు.
    టెంప్లేట్ చక్కగా ఉంది.
    చలం మల్లెపూల కవిత ని ప్రజెంట్ చేసిన తీరు హృద్యంగా ఉంది.
    దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి
    "మల్లెపూలు మల్లెపూలు
    కలువపూలు కావాలా
    ఎన్నెన్నో వన్నె పూలు
    చిన్నారి కన్నెపూలు"
    కవితని ఆర్. బాల సరస్వతి గారు అద్భుతంగా పాడారు.
    చలం కవిత బాల సరస్వతి పాటని గుర్తుకు తెచ్చింది.
    అభినందనలు.

    ReplyDelete
  30. ఎంత బాగా రాసారండి. గీతాంజలి చదివాక చలం ఇలా గూడా రాస్తాడ అనిపించింది. అయిన చలం రాయలేనిది ఏమిటి. మీ మల్లెపూల పరిమళాలు మధురంగా ఉన్నాయి. చిన్న అనుమానం, " వొళ్ళమధ్య చేతులమధ్య" అది వేళ్ళ మధ్యనా? నేనే తప్పు అర్థం చేసుకొన్నాన?

    ReplyDelete
  31. chalam gurinchi evaru cheppina naaku chala anandamgaa vuntundi.
    may be ee site meeru cusi vundaru. oka saari cudandi.

    chelam.blogspot.com

    ReplyDelete
  32. I don't why U stopped!
    U can continue . . .

    Sridhar

    ReplyDelete