యు . యఫ్. ఎ . అంతర్జాతీయ అధ్యక్షుడు చలం. -- వి . విశ్వం. 'ఎందుకండీ ఆ యూస్ లెస్ ని అట్లా వాళ్ళు మేపటం?' అని వున్న కోపాన్ని నా ముందు కక్కేశారాయన.
ఆయనెవరంటే ఒక పెద్ద ఉద్యోగి. పండితుడు కూడా. ఆయన అభిప్రాయాలకు, అభిరుచులకు విలువైన స్థానం వుంది. యూస్ లెస్ ఫెలోస్ అని ఆయన అన్నదెవర్ని అంటే వాళ్ళు చలానికి అతుక్కు పోయిన వాళ్ళు. ఏదో ఒక చోట జీవితం లో దెబ్బ తిన్నవాళ్ళు, నెలలు, సవత్సరాలూ చలం దగ్గరే వుండి తమను తాము రీచార్జీ చేసుకుంటున్న వాళ్ళు. మేపుతున్న వాళ్ళు చలం, సౌరీస్ గారు! నాకో పేరున్న సంస్థ లో వుద్యోగం వుండే సరికి నేను పనికి వచ్చే వాడి లాగా కనపడి కలిసినప్పుడు నాతో స్నేహం గా మాట్లాడే వారు. ఆయనా చలం అభిమానే అయితేనేం? చలం చుట్టూ చేరిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళలాగా కనపడ్డారు.
ప్రయోజకుల్ని చలం ఎందుకు పట్టించుకుంటాడూ? అటువంటి వాళ్ళకు చలం అండ ఎందుకూ? అవసరమైన నమ్మకాల్ని ధరించి, ఎగరెయ్యాల్సిన గొడుగులు ఎగరేసి, పరిధుల్లోనే వున్నామని నమ్మించి, చివరకు మీతోనే పోటి పడి, మీ కుర్చీ ని లాక్కుపోయే వారు కారా? చలం ఎందుకూ? చలం రచనల లోని కళా విజృంభణ నూ వైదగ్ధ్యాన్ని విశ్లేషిస్తూ పేరు సంపాయించేవారు కదా! ఆయనా చలం రచనల్లోని సాహితి విలువల్ని చాలా మంది కంటే బాగా చెప్పగలడు. అయితేనేం? ఆ పుస్తకాల్లోని మనుష్యులు కనపడ్డప్పుడు మొత్తం గా కాక పోయినా కొన్ని పోలికలతో అంతటి చలం అభిమానీ మా అమ్మమ్మ లాగే మాట్లాడారు.
ఆయనే కాదు చాలా మంది అంతే. ఆ అభిప్రాయం చలం నీడన విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ మీదే కాదు. కాస్త పరిధి విస్తరించి, కాసిని మాటలు నేర్చుకునీ, రంగు రంగుల ఆదర్శాలు చేర్చుకునీ చలానికి చలం నాయకలక్కూడా వర్తింపచేస్తారు.
స్వేచ్హ కోసం పోరాడాడు చలం అంటునే అది పరిష్కారం కాదు అంటారు. ఎంత గొప్ప రచన అంటూనే 'అయినా చివరికేమయింది ఆమె, ఎన్ని కష్టాలు, చలం అసలు ప్రాక్టికల్ కాదండి.' అదీ వరుస. 'వాల్లేమి సాదించారు, ఓడిపోయారు.పారిపోయారు. నిలబడలేకపోయారు. ' అని తీర్పు.
ఇట్లా మాట్లాడిన వీళ్ళే తమ రచనల్లో, వుపన్యాసాల్లో సమాజం అస్తవ్యస్తవ్యం గా వుంది, సమూలం గా మార్పు రావాలని అంటారు. అంత చండాలపు సమాజం లో చలమూ, చలం నాయికలు రాణించలేక పోయరని, అది ఓటమి అని తీర్పు చెపుతున్నప్పుడు , ఆ సమాజపు విలువలతోనే, కళ్ళతోనే చలాన్ని చూస్తున్నామని మర్చిపోతారు ఆ అస్తవ్యస్త సమాజం లో రాణించలేక పోయరని అంటారు.
ఈ సంఘం లో రాణించటమంటే ఈ విమర్శకుల దృష్టి లో ఆ పాత్రలు ఎట్లా వుండాలని కోరుకుంటున్నారో ఊహించటం కష్టం కాదు. ఒక విమర్శకుడు అననే అన్నాడు... " 'కనీసం ఆ రాజేశ్వరి మరీ ఆ జట్కా బండి, మొరటు సాయిబు తో కాకుండా కారున్న ముసల్మాన్ తో లేచిపోయి పెళ్ళి చేసుకుని సుఖం గా కాపురం చేసినట్లు రాస్తే చలం సొమ్మేం పోయింది" ' అని. దాదాపు గా అందరి దృష్టి లో ధ్యేయం అదే.
సరే - మొదటి మొగుడ్ని వదిలేయటం విప్లవమే కాని! ఆ కుర్ర వెధవ తో ప్రేమలేమిటి? అని మరో విమర్శ... ఆ మొదటి మొగుడు బాధలు పెట్టక పోయినా (పోయినా ఏమిటి పెట్టలేదు) వదిలేయటం తో వచ్చిన విప్లవం మూడో మొగుడి తో దెబ్బ తింటోంది... ఇట్లా ఎన్నో మొగుడి తో మొదలు అయ్యి స్వేచ్హ ఎన్నో మొగుడి దగ్గర ఆగిపోయిందో లెక్కలు. పూర్వం స్త్రీలకు విద్య ఎంత వరకు అవసరమో, రవిక చేతులు ఎంత పొడుగ్గా లేక ఎంత పొట్టిగా వుంటే సంప్రదాయమో లెక్క వేసినట్లు ఇంత గందర గోళం ఎందుకు వస్తుందంటే ఏ సిద్ధాంతాలు మాట్లాడినా స్త్రీ పురుష సంబంధాలలో స్వేచ్హ అనగానే, ఇవాల్టి వీరులలో నుంచి మన తాతయ్య లు అమ్మమ్మలే మాట్లాడతారు. జీవితం మీద అధికారాన్ని దేవుడి దగ్గర నుంచి లాక్కొని ప్రభుత్వం చేతిలో పెట్టీ, ప్రారబ్ధాన్ని కాకుండా లీడర్ ని తిట్టూకుంటు బతకటానికి ఒప్పుకుంటారు.
కానీ జీవితాన్ని తన చేతులలోకి తీసుకుని, ఆ బాధ్యతేదో తనే మోస్తానని ఇంకెవర్నో తిట్టుకుంటు బతకటం ఇష్టం లేదని ఎవరైనా అంటే, అటువంటి వాడి మీద అటు దేవుడి భక్తులు, ఇటు గవర్న్మెంట్ భక్తులు కత్తులు దూస్తారు...
పూర్వం చెడి పోవటమంటే మోక్షానికి పనికి రాకుండా పోవటం...ఇప్పుడేమో గవర్న్మెంట్ పరిధి లో లేక పోవటం... చలం స్త్రీలు, చలము నిజం గా ఓడిపోయి, నిలభడలేక, పారిపోయి, పనికిమాలిన వాళ్ళేనా? చూద్దాము...
రత్నమ్మ:బంగారమ్మ, చి.సుందరమ్మ, రమణ లు ఏమి చేసేరో తెలియదు కాని మన చలాన్ని ఆవిష్కరించింది రత్నమ్మ. మిగిలిన కవులకు కలలును, కన్నీళ్ళను, కవిత్వానికి ప్రేరణ గా ఇచ్చినా చలానికి మాత్రం రత్నమ్మ శరీరాన్ని, హృదయాన్ని వీటి సంబంధాన్ని పరిచయం చేసింది. కాని ఆమె జీవితం లో చలం ప్రభావం వుండే ఆస్కారం తక్కువ. తర్వాత పెళ్ళి చేసుకుంది, చచ్చిపోయిందీ -- వచ్చిన పని ఐపోయినట్లు.
డా. వొయ్యి, రంగనాయకమ్మ గార్లు.చలం నాయికలు వీళ్ళు ఇద్దరూ. డా. వొయ్యి చలానికి వదినె గారు. భార్య రంగనాయకమ్మ గారికి అక్క. వీళ్ళు ఇద్దరు చలం ప్రభావం లో పూర్తి గా మునిగిపోయిన వాళ్ళు. చిన్న తమ్ముళ్ళూ, చెల్లెళ్ళు నోరు తిరగక వొదినె అని పిలవలేక వొయ్యి అని పిలుస్తుంటే ఆ పేరే ఆమె కు ఖాయం అయ్యింది. ఆమె బాల్య వితంతువు. చెల్లెలు రంగనాయకమ్మ కు చలం తో పెళ్ళి అయ్యాక మొదలయిన పరిచయం ఆయన సాహచర్యం ఆ కుటుంబాన్నీ, సంప్రదాయాన్ని ధిక్కరించి చదువుకుని డాక్టరయ్యింది. "అంత గొప్ప స్త్రీ ని నేనెక్కడ చూడలేదు " అంటాడు చలం. చలం భావాల్ని ఏ ఘర్షణ లేకుండా అతి సులభం గా ఆచరించ గలిగింది. సంఘం కోసం ఏ మర్యాద, ముసుగులు ఆమె వేసుకోలేదు. సంఘమే తన అవసరానికి ఆమె దగ్గరకు వచ్చి బాధల్నించి తప్పించమని అడిగింది. కాని వొయ్యి ఎవ్వరి మీదా ఆధార పడలేదు. " రక్షణ మందిరం" ఆలోచన చలానిది. కాని ఆయనెక్కడెక్కడో వుద్యోగాలు చేస్తూ వూళ్ళు మారుతుంటే రక్షణ మందిరాన్ని నడిపింది వొయ్యి రంగనాయకమ్మ గార్లే. ఏ స్త్రీ కు ఎటువంటి రక్షణ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా వెంటనే రంగం లోకి దూకే వాళ్ళు. ఎంతటి సాహసానికి తగ్గే వాళ్ళు కాదు. ఏ అధికారానికి భయపడలేదు. అట్లా నడిపేరు ఆ రక్షణా మందిరాన్ని. వొయ్యి లాంటి స్త్రీ లను నిందించిన వాళ్ళే తమ కుటుంబ స్త్రీ లు హృదయాదేశాల వల్ల ఏ చిక్కులలో పడితే, రక్షించమని ఆ వొయ్యి దగ్గరకే చేరే వారు. వాళ్ళను కాపాడి సహాయం చేసి, ధైర్యం చెప్పి, మళ్ళీ మాములు మనుష్యులను చేసి తిరిగి సంఘం లోకి పంపే వారు డా. వొయ్యి. చలం అంతటి సంక్లిష్టమైన వ్యక్తిత్వం వున్న వాడిని అర్ధం చేసుకున్న స్త్రీ ఆమె. చివరకు చలం భగావాన్ మీద విశ్వాసాన్ని పెంచుకుంటుంటే " ఆ గుర్రానికి తోక వుంటే దాని ఈగలను తోలుకుంటుంది కాని మీ మీద వాలే ఈగలను ఎందుకు తోలుతుంది " అనగలిగిన వ్యక్తిత్వం ఆమెది.
రంగనాయకమ్మ గారు: చలం భార్య. పెళ్ళయ్యాక చలం ప్రోధ్బలం మీద చదువుకున్నారు. మాములప్పుడు చలాన్ని ఒరెయ్ విఘ్నేశ్వరా అని పిలిచి కోపమొచ్చినప్పుడు ఓరి దరిద్రుడా అని సంభోదించగలిగిన స్త్రీ. చలం మూలం గా వచ్చిన కష్టాల్ని ఎక్కువగా భరించింది ఈమే నంటారు సౌరిస్ గారు. రంగనాయకమ్మ గారిని తలుచుకున్నప్పుడల్లా హనుమయ్య గారి గీతం గుర్తు వస్తుంది. " పసిపాపలకు పాలను రసలుబ్ధులకు పానకాన్ని ఇచ్చే జీవితం సోక్రటీస్ లాంటి వాడికే విష పాత్ర ని ఇచ్చి చాలెంజ్ చేస్తుందని". చలం అనే విష పాత్ర ను రంగనాయకమ్మ గారికి ఇచ్చి జీవితం చాలెంజ్ చేసింది. ఆ సవాల్ ను ఆమె తీసుకున్నారు. మోయలేక అప్పుడు అప్పుడు విసుక్కున్నా చలం స్నేహితుల భార్యల్లా వదిలి పెట్టి పారిపోలేదు. " ఆ నీకేమి తెలుసు నిన్న పుట్టేవు.. వాళ్ళెన్ని బాధలు పడ్డారో... మా ఇంటి పక్క గదిలోనే వుండేదామె... నాకు తెలుసు అసలు సంగతి" అన్నడొక న్యాయ మూర్తి, నా స్నేహితుడి మామ గారు, చలం అభిమాని. నిజమే -- చలం జీవితం లోని స్త్రీ లే కాదు రచనల్లోని నాయిక లు మాములు మనుష్యులకంటే ఎక్కువే బాధ లు పడ్డారు. కాని అవేవి వాళ్ళను గాయం చెయ్యలేదు. వంకర్లు తిప్పలేదు. రహస్యం లో దాక్కునేట్లు చెయ్యలేదు. సాధారుణులను వదిలేసినా సంఘ సంస్కర్తలు గా పేరు పొందిన వారు ప్రవేటు మాటల్లో ఎంత నిరాశ నింపి మాట్లాడేరో చివరకు. జీవిత చరిత్రలలో చివరి రోజులు వుండవు. వున్నా నిజం రాయరు. ఆ రచనలంతటి కాల్పానిక సాహిత్యం ఇంకోటి వుండదు. చివరి రోజులలో సినిక్స్ గా మారిపోయి చేదు పులుముతూ ఎందరు కన్ను మూశారో...
చలం స్త్రీలు,చలం ఎప్పుడు వ్చిషం గామార లేదు. మనుష్యులను ప్రేమిస్తూనే వున్నరు. జీవితాన్ని శ్రద్ధ గా ఆరాధిస్తూనే వున్నారు. కష్టాలు ఎంత లోతు గా గుండె ను చీలిస్తే అంత లోతు గాను. విశాలం గాను వాళ్ళ ధృక్పధం మారింది. కాని ఇరుకై పోలేదు. కష్టాలు రానిదెవ్వరికి? వాళ్ళు ఆ తరువాత సుఖం గా బతికేరు. లోకం జేజే లు పలికింది అని రాసినా అటువంటిది ఆశించినా పసితనం అవుతుంది. బాధలు పడటం తప్పూ కాదు నేరము కాదు ... అవివేకము కాదు. వాటి లోనుంచి గాయ పడకుండా వస్తారు వున్నతులు. ఆ సంస్కారం ముఖ్యం కాదా....!
లీల గారు:చలం రచనలు చదివి ఆయన్ని ప్రేమించి జీవితం లో ప్రవేశించిన మరో స్త్రీ లీల గారు. ఆమె వూర్వశి అయ్యారో లేదో తెలియదు కాని "పూరూరవ" కు ఆధారమైనందుకు మనం ఆమె కు రుణ పడి వుండాలి. బతుకు చివరి దాకా చలం తో నడవాలనే కోర్కె తో సహచర్యం మొదలు పెట్టినా ఆయనంత వేగం గా పరిగెత్త లేక ఆగిపోయారు పారిపోలేదు...
తర్వాత చలం రచనల్లోని నాయికలు అనగానే గుర్తు వచ్చేది -- రాజేస్వరి, అరుణ. చలం పాత్రలన్ని కాల్పానికం, బయటెక్కడ కనపడరు అంటారు కాని -- నేనే అరుణ ను తెలుసా అని గర్వం గా చెప్పుకున్న స్త్రీలను నా చిన్ని జీవితానికి నేనే ఇద్దరు కాదు ముగ్గురు స్త్రీలను చూశాను. రాజేశ్వరి మీద తీర్పు చెప్పేటంత చివరిదాకా ఆమె జీవితం లేదు మైదానం లో.... ఆ రచన కున్న నేపధ్యం కూడా విశేషమయినదే. ఆంధ్రా యూనివర్సిటి నవలల పోటీ పెడ్తోందనీ, ఫలానా వాళ్ళు జడ్జీలనీ, ఫలానా రచయతలు పోటీ కి దిగేరనీ ఒక మిత్రుడొచ్చి చలం తో చెప్పాడు. చలానికి ఒళ్ళు మండింది. వీళ్ళే కదా తన రచనలు చదవొద్దని ప్రచారం చేసేరు ఇన్నాళ్ళు... ఇప్పుడు వీళ్ళ చేతనే చదివింపచేసి నిద్రపట్టకుండా చేయాలనుకున్నాడు... వుత్త లైంగిక వ్యవహారం తో షాక్ తినిపించాలని రాయటం మొదలు పెట్టేడు. గడువు ఎక్కువ లేదు, రాసింది తిరిగి చూసుకునే వ్యవధి లేదు. రాసిందాన్ని అట్లాగే చుట్ట చుట్టి పోస్ట్ కు పంపి తిక్క కుదిర్చాను అని గంతులేస్తూ కూర్చున్నాడు. బహుమతిని ఎటూ ఆశించలేదు కాని -- సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారు దాన్ని వుత్తమ రచన గా అభిప్రాయ పడ్డారని తెలిసి ఆశ్చర్య పడ్డాడు. ఆయన అభిప్రాయం అట్లా వున్నా దానికి బహుమతి ఇచ్చే ధైర్యం జడ్జీలకు లేదు. చలం అప్పుడు వెలి. బహుమతి ఇస్తే వాళ్ళను వెలివేస్తారేమో ఇవ్వక పోతే రాధా క్రిష్ణన్ గారిని ధిక్కరించినట్లవుతుంది. అందుకని రాధాక్రిష్ణన్ గారికి నచ్చ చెప్పి ప్రధమ బహుమతిని ఏ ఒక్కరికో ఇవ్వకుండా రెండు గా చీల్చి ఇద్దరు రచయతలకిచ్చి గండం గట్టెక్కామని స్థిమిత పడ్డారు.
తిరిగొచ్చాక స్థిమితం గా చదివిన చలమే ఆశ్చర్య పోయాడు తన రచన చూసి. ఉద్దేశించిన పరిధులు దాటి ఎంత వున్నత ప్రదేశాలకు వెళ్ళిందో గమనించి. ఒక విమర్శకుడన్నాడు -- సంఘ మర్యాదలు దాటిన స్త్రీ పడే బాధలు చెప్పి హెచ్చరించటానికి ఆ రచన చలం చేసేడని.
రాజేశ్వరి నిలబడలేక పోయిందని ఓడిపోయినట్లేనని మరొక విమర్శ. మొదటి పేరా ఒక్కటి చదివితే చాలు విమర్శకులు రచనకెంత దూరం గా వున్నారో తెలుస్తుంది.
సాంప్రదాయ కుటుంబం లోని బ్రాహ్మణ స్త్రీ కుటుంబాన్ని వదిలి ఇద్దరు ముస్లిం ప్రియులతో వూరి బయట బతికి ఒక ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటే రెండో ప్రియుడితో జైలు జీవితం కూడా అనుభవిస్తుంది. బయటకు వచ్చాక చూడ వచ్చిన స్నేహితురాలితో గడిచిన జీవితమంతా చాలా స్థిమితం గా పవిత్రమైన తపోసాధనను వర్ణించినట్లు చెపుతుంది. ఆ జీవితం ఈశ్వరుడికెత్తిన మంగళహారతి వలే తోస్తుందామెకు వెనక్కి చూసుకుంటే. ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేదు. నిందలు వేస్తున్న వాళ్ళమీద కనీసం ద్వేషం కూడా వుండదు, పైగా జాలి పడుతుంది. " ఇటువంటి అనుభవం లేక పాపం ఈ మనుష్యులు ఆ చిన్ని కంతల్లోనించి తప్ప జీవితం చూడలేరు కదా" అన్నట్లు.
అటువంటి రాజేశ్వరి ఎవరికి భయపడి పారిపోతుంది????
ఆరుణ: అరుణ జీవితం లో ఏదో ఒక చివరకొచ్చిందనే అనుమానం వచ్చే అవకాశమే లేదు.
మూసి వున్న తలుపులలోనుంచి నాయకుడి మేడ మీద గదిలోకి వచ్చిన అరుణ అట్లాగే ఒక రాత్రి మాయమయిపోతుంది. ఆమె ఓడి పోయిందనో ఆత్మహత్య చేసుకుందనో అనుకోవటానికి ఆధారమే లేదు. పైగా దానికి విరుద్ధం గా " కానీ ఈ అంధకారం లో ఆకాశం కొంచం గా తెరుచుకుంది. కొత్త విధం ఆనందానికి కొత్త ద్వారం కొంచం తెరిచారు. ప్రయత్నిస్తాను. ఈ శరీరాన్ని, ఈ మొద్దుని, భారాన్ని అతిక్రమించి ఎగరటానికి చూస్తాను, నేనేమి చెప్పలేను" అని సృష్టంగా చెపుతుంది. చివర "నేనింతవరకు ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పుడు తలుచుకు చూసుకుంటే! నా హృదయం లోగొప్ప ప్రేమ వుంది. ప్రేమించాలనే ఆశ అపారంగా వుంది." అంటుంది. "సునో ముసాఫిర్ భాజతు ఢంకా" అరుణకు వినబడుతోంది. అరుణ కోసమే గంటలు మోగుతున్నాయి. భద్రతలను, భయల్నీ కాపాడుకుంటూ విలువల్ని లెక్క కట్టుకుంటూ చేసే ప్రయాణం కాదది. అవన్ని వూహాత్మకమని ఎప్పుడో తేలిపోయింది. ధ్యేయాలన్ని బోలువనీ తెలిసి పోయింది. కొత్త దాని కోసం ఎగరాలి తప్పదు. ఆ టేకాఫ్ పాయింట్ అరుణ. ఆమె ఏదో అయ్యిందని తీర్పు చెప్పే అవకాశమే లేదు. రచయత అంతకు ముందు " ఏమీ అక్కర్లేకుండా అవసరం లేకుండా లోకాన్ని చూడటం గొప్ప అనుభవం గావును!" అంటూ సూచిస్తాడు. అరుణ చలమే అందుకే చలం అరుణాచలం అయ్యాడు జీవితంలో వెంటనే.
చలం రచనల్నీ 'సమస్యా-పరిష్కారం' అనే చట్రంలోంచి చూడటం మూలం గా వస్తున్న అనర్ధాలు ఇవి. ఈ తీర్పులు. నిర్మాణాత్మక రచన లు చలం చేయలేదని, అవన్నీ సృజనాత్మక రచనలనీ గుర్తు పెట్టుకుంటే తొందరపడి చెప్పే తీర్పులు ఆగిపోతాయి.
" ఇంకా ఏం చలం! " అనటం అర్ధ దశాబ్ధం గా ఒక ఫ్యాషన్. చలం వెనక్కి పోయాడు కాని మేము ముందుకు పోతున్నామని ధ్వనింపచేస్తూ అట్లా మాట్లాడే వాళ్ళు మరీ అంత కొత్తది కాకపోయినా, కాస్త కొత్త తోవ తొక్కాలనుకున్నప్పుడు ధైర్యానికి చలం వైపే చూసే వాళ్ళు. అరుణాచల యాత్రే చేయాల్సి వచ్చేది. ఇక దగ్గరి స్త్రీలు నీతి సంబంధమైన చిక్కులలో పడితే చెప్పనవసరం లేదు. చలం నీడే వాళ్ళకు గూడు అయ్యింది. పేర్లు చెపితే ఆశ్చర్య పోతారు. " నాకా స్త్రీ అంటే ఇష్టం. స్నేహం కుదిరేట్లు చేస్తే ఈశ్వరుడిని నమ్ముతాను" అన్న ప్రముఖ నాస్తికుడు ఇంకా బతికే వున్నాడు. అరుణా చలాన్ని చిన్నబుచ్చటం ఆయన రాజకీయ విధానం.
అంతకు పూర్వమూ అంతే. ఏదో ఒక విపత్తులో సంఘానికి భయపడి చలం రక్షణలో ధైర్యం పుంజుకుని బయటికొచ్చి " చలం మమ్ములను నాశనం చేయబొయ్యాడు . తెలివిగల వాళ్ళము కాబట్టి మేం బయటపడ్దం" అనే వాళ్ళు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చలాన్ని మేము కాపాడాం అనే మాటలొచ్చాయి. విప్లవమే -- ఏదో ఒక రకం
చలాన్ని గురించి మాట్లాడేటప్పుడు అందరు మరిచిపోయే స్త్రీ -- సౌరిస్ గారు. ఆయన పెద్ద కూతురు. ఆయన కోసమే పుట్టేననే సౌరిస్ గారు ఆ అగ్నిపర్వతానికి స్నేహాన్ని కంపెనీ ఇవ్వటమే కాక టేకాఫ్ పాయింట్ లో ముందు నడిచి తోవ చూపించారు. ఆయనకే కాదు ఇప్పటికీ తోవ తెలియని వాళ్ళకు చూపిస్తూనే వున్నారు. చలం మార్గం ఆత్మహత్యా సదృశ్యమో కాదో భీంలీ వెళితే కనిపిస్తుంది.
చివరగా -- చలం ప్రేమ వ్యవహారాలు అందరికి తెలిసిందే. స్త్రీ లోలుడు అని అనటం అంత వింతేమి కాదు. కాని మొదటి సారి ఆయనను చూసినప్పుడు లీల గారి తల్లి అన్నారట " ఆయనకసలు ఏ స్త్రీ అయినా అవసరమా?" అని. లీలగారు తరువాత ఆ అభిప్రాయాన్ని సమర్ధిస్తారు. - అనుభవం తో. ఇది విశేషమైన దృక్పధం.
విశ్లేషకులు రంగం లోకి దూకవచ్చు.