Monday, August 3, 2009

ఆనందం

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...

లోకం
ఆనంద మయం. ఆనందం కోసమే ప్రయత్నిస్తుంది. ప్రతి జీవి యొక్క పరమావధి ఆనందమే... పశువులు పక్షులు అన్నిటికి బాధ నుంచి తప్పించుకోవాలని హాయి గా బతకాలని ఒక్కటే ప్రయత్నం. మనుష్యులు హాయి గా బతకటమే కాకుండా కొన్ని విధాలైన ఆనందాన్ని కూడా పొందాలని చూస్తారు. బాధ కావాలని కోరే వారెవరు లేరు. కోరి బాధ లు పడే వాళ్ళూ, సుఖాన్ని త్యజించే వాళ్ళూ లేక పోలేదు. చచ్చిన వాళ్ళను మర్చిపోక వూరికే జ్ఞాపకం చేసుకుని ఏడ్చే వాళ్ళూ , ఇతరుల సౌఖ్యం కోసం తమ ఆనందాన్ని వొదులుకునే వాళ్ళూ, నోట్లోంచి కడ్డీలు దూర్చుకునే వాళ్ళూ , పంచాగ్ను ల మద్య తపస్సు చేసే వాళ్ళూ వున్నారు. కాని , ఆ బాధ వాళ్లకు ఆనందం కనుక లేక ఆనందకరమైనది బాధ వల్ల సమకూరుతుంది అనుకుంటారు కనుక , ఆ బాధ పడతారు.

ఆనందం అనేక రకాలు. ముఖ్యం పంచేంద్రియాలవల్ల, సంపాయించేది. మనసు వల్ల పొందేది.. వున్నతమైన ఆలోచనలూ, సంభాషణా స్నేహమూ ప్రేమా మొదలైన వాటివల్లా సౌందర్యాల వల్ల కలిగే ఆనందం; అందమైన కధలూ, నాటకమూ, సంగీతమూ, బొమ్మలూ మొదలైన వాటివల్ల కలిగే ఆనందం. ఆనందం లోనే యెక్కువ తక్కువ లు వున్నాయి. తిని నిద్ర పోయి జంతువులవలే బతుకులో పొందే ఆనందం, గంతులేసి నవ్వి అల్లరి గా వుంటే వచ్చే ఆనందం, తృప్తి పడి నా కింకేమీ అక్కర్లేదని శాంతం గా వుండే ఆనందం, లోకమంతా తనకే కావాలనే అధికారాలకీ, ధనార్జనకీ కష్ట పడుతు పొందే ఆనందం, దేశాల్ని, సంఘాల్ని బాగు చెయ్యలనీ, కొత్త విజ్ఞానాన్ని సంపాయించాలని, కొత్త లోకాన్ని కనిపెట్టాలనీ ప్రయత్నిస్తో జీవితాలర్పించే ఆనందం.

ఇవేకాక మనకు తెలీనివీ, భూలోకానికే చెందనివీ, ఇంకా మనం చూసే ఆకాశానికీ ఇతర గోళాలకు చెందినవీ అనేక విధాలైన ఆనందాలు వుండవచ్చు. చీమ పొందే ఆనందం వుంది మనం పొందే ఆనందం వుంది. భేదం ఇంద్రియ భేదం వలన కలుగుతోంది. దాని కళ్ళు మన కళ్ళు ఒకే కాంతిని చూడవు. చెవులు ఒకటే ధ్వని ని వినవు. అట్లానే మనకే ఇంకా బలమైన చెవులు - కళ్ళు వుంటే, ఆకాశ ధ్వనులు, కాంతులు, -- ఆకులు చేసే రహస్య గీతాలు -- కీటకాల సంభాషణ, -- ఎన్ని వినగలమో, చూడగలమో.

అంతే కాదు పంచేంద్రియాలు వుండబట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నాము. పది జ్ఞానేంద్రియాలుంటే - పది రకాలు ఐదూ కాక, ఇంకో విధమైనవి వుంటే - కొంచం ఆలోచిస్తే తెలుస్తుంది - అనంత మైన ఆనందాలు వుండటానికి వీలుందని. భూలోకం లో విధమైన ఆనందాలున్నాయి; చంద్ర లోకం లో, అనూరాధా లోకం లో, ఆరుద్ర లోకం లో -- చెప్పలేము

ఇవన్ని శరీరాలకు సంభందించిన ఆనందాలు. మతాలు ఇంకో ఆనందాన్ని గురించి చెపుతాయి. ఆనందాన్ని స్వర్గ లోకం లో పొందుతామంటారు. ఆనందం రెండు విధాలు. భూలోకపు ఆనందాల వంటివే శరీరానికి సంభందించినవి, రెండోది ఈశ్వరుడి సాన్నిధ్యం వల్ల కానీ, స్తోత్రం వల్ల కాని, లేక ఐక్యం వల్ల కాని, కలిగే ఆనందమూ, స్వర్గానందాలకు భూఆనందాలకు విరోధం అంటారు. అవి కావాలంటే వీటిని త్యజించాలి. ముఖ్యం గా స్వర్గం సంగతి తెలిసిన వాళ్ళు కొన్ని నీతులను చట్టాలను ఏర్పరిచారు. ముఖ్యం గా వాటిని అతిక్రమించకుండా సంచరిస్తే స్వర్గము, ఈశ్వరుడు దొరుకుతారు. కాని , ప్రకారం చేస్తున్న మనుష్యులెవ్వరు కనబడరు. ఎవరికి అది నిశ్చయం లేదనుకుంటా. ఒకవేళ అందరు వివేక వంతులై స్వర్గం కోసం క్షణ భంగురమైన భూలోక ఆనందాలని త్యజించి శాస్త్ర ప్రకారం చట్టాలు, ధర్మాలు అనుష్టిస్తారు అనుకోండి, స్వర్గం ఏట్లా వున్నా భూలోకం ధ్వంసమైపోతుంది.

ఇప్పుడున్న తమాషా, నవ్వు, ప్రేమా, స్నేహమూ అన్నీ నశించి లోకం నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఎంత త్వరలో లోకాన్ని విడిచి లోకానికి వెళితే అంత వుత్తమం గా తోచాలి ప్రజలకు. మొత్తానికి ఎవరిని చూసినా ఈశ్వరుడు, ఆయన లోకమూ, దాని మార్గము గురించి మాట్లాడే వాళ్ళే కాని, లోకాన్ని విడిచి లోకానికి, దాని ఆనందాల కోసం త్వర గా ప్రయాణమవుతున్న వాళ్ళు ఎవ్వరు కనిపించరు.

ప్రతి వాళ్ళు బాధ నుంచి తప్పించుకుని ఆనందాన్ని పొందుదామని చూస్తారుగాని నేర్పు కలిగి ఆనందాన్ని పొందగలిగే వాళ్ళు కొద్దిమందే కనపడతారు. మన "ఇన్ స్టింక్ట్" ఆనందం కోసం బలీయం గా వుంది. తనకు బాధ కలిగించే పనుల నుంచి మన శరీరం తనంతట తానే తప్పుకుంటుంది. కాని మన మనసుకు మాత్రం ఇంకా "ఇన్ స్టింక్ట్" రాలేదు. జ్ఞానము , నేర్పు ఇంకా సంపాయించలేదు. ఏది తమకు ఆనందం ఇస్తుందో, బాధల నుంచి ఎట్లా తప్పుకోగలరో మనుష్యులు ఇంకా నేర్చుకోలేదు, కనుకనే ఎవడు వచ్చి "ఆనందం" అని కేకలు వేసినా వాడి వెంట పరుగెత్తుతారు.

ఆనందం విషయమై కొన్ని నిబంధనలు కనపడుతున్నాయి.
నాకు ఆనందం కావాలి, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే వొచ్చేట్లు కనపడదు. ఒక కార్యం ద్వారానే కలుగుతుంది ఆనందం. మనసు కార్యం మీద వుండాలికాని ఆనందం మీద వుంటే ఆనందం చెదిరిపోతుంది. తీపి కావలన్న వాడూ తీపి కోసం ఎక్కడన్నా వెతుకుతుందా? తీపి నివ్వగల చెరుకు కోసం వెతకాలి. అట్లానే ఆనందం కావాలిస్తే ఒంటరిగా కూచుని ఎవరికి లేకుండా కొంత ఆనందంసంపాయించుకోవాలంటే అది క్షుద్రరూపాల ప్రసన్న మవుతుంది. ఒక్క నిమిషము లో నశిస్తుంది. మనం జీవిస్తున్నాం, మనకు ఆనందం కావాలి అనే ధ్యాస లేకుండా జీవితాన్ని గొప్ప వుద్యమాల్లో, లోక క్షేమానికి ప్రపంచానందానికి చేసే ఘన ప్రయత్నాలలో ఐక్యమయ్యే మనిషి పొందే ఆనందాన్ని స్వార్ధపరులు పొందనట్లు తోస్తుంది. మొదటి రకపు ఆనందం స్వభావమే వుత్తమమైనది గా తోస్తుంది.. ఒక ఆనందమైన కధనుగాని, బొమ్మను గాని సృష్టించే ఆనందం తలుచుకోండి...

ఆనందం ఎవ్వరికి ఇవ్వను; నేనే దాచుకుంటాను అన్న నిమిషాన ఆనందం మాయ మౌతుంది . చెట్టునున్న పువ్వును జేబులో దాచుకున్నట్లు, ఎవరెత్తుకుపోతారో అని భార్యలను దాచుకునే వాళ్ళు, విషయమై కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.... చక్క గా యోచిస్తే ఇతరులనుంచి దాచుకున్నామన్న తృప్తి తప్ప మాత్రమూ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు.

తనే ఆనందం పొందాలనే కార్యాలకన్నా ఇతరులకు ఆనందమిద్దామనే వూహ తో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. తిండి తినటానికి సంగీతం పాడటానికి భేదం ఆలోచించండి. అందువల్లనే ప్రేమ వలన వచ్చే ఆనందం అద్వితీయమైనది. ఎందుకంటే ప్రేమ వున్నప్పుడు తనకి ఎంత ఆనందం వస్తుందనే ధ్యాస వుండదు. ఎంతసేపు ఇతరులకు ఎంత ఆనందం ఇవ్వగలమనే యోచనే బలం గా వుంటుంది..

ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి వుపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి శక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి అనందాన్ని పొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మ లూ వున్నాయి.

ప్రతి జీవికి కొంత శక్తి వుంది. కొంత కాలం వుంది. శక్తినీ కాలాన్నీ ఆనందం లో కూర్చుకునే తెలివితేటలు లేవు. జీవితం "ఆర్ట్". ఒక కళ. మనం వివేకవంతులమైతే మన శక్తి నంతా ఆనందం గా మార్చుకోగలం. మన కాలమంతా మనకు ఆనందాన్ని ఇచ్చేట్లు చేయగలం. మహా శక్తి మన పుటకవల్లనో సంస్కారం వల్లనో కొంత కలుగుతుంది. కొంత మనకు చిన్నప్పుడు ఇతరులు నేర్పిన "అలవాట్ల" వల్లా పెద్దయ్యి మనకు మనమిచ్చుకునే శిక్షణ వల్లా యేర్పడుతుంది.

లోకం లో మొత్తానికి ఎవరు ఆనందవంతులుగా కనపడుతున్నరంటే, వారి స్వభావాలకీ, గుణాలకి, వేటి వేటి మధ్య వున్నారో పరిస్తితులకు; సమత్వం కలిగించుకున్న వాళ్ళు.. చాపలు ఎంత మంచి మందిరాలలో వుంటే యేమి లాభం? ఏనుగులు సముద్రాల మధ్య తెల్లని ఇసుకల్లో పడుకుంటే ఏం సౌఖ్యం? తక్కువ స్థితిలో వున్నా, ఎక్కువ స్థితి లో వున్నా సరిపోవాలి. లోకానికి వ్యక్తి కి సంధి కుదరాలి. వ్యక్తి లోని శక్తులన్నీ చక్క గా వినియోగమయ్యే పరిస్తితి వుండాలి. చిత్రకారుణ్ణి చిత్రించ వద్దని ఆజ్ఞ పెట్టి మహారాజు గా చేసినా అతనికి తృప్తి వుండదు. తన కళ కోసం బాధ లోనే వుంటాడు.


లోకం లో అనేక విధాలైన ప్రాణాలున్నాయి. కంటి కగపడని సూక్ష్మ జీవుల నుంచి మనుష్యుల వరకు -- అనేక స్తితులలో అనేక ప్లేన్ లో బ్రతికేవి వున్నాయి. వేటి గుణాలు,ఆకారం,కష్టాలు, ఆనందం,ఇంద్రియాలు, బుద్ది వాటివే. కీటకాల్లో అనేక రకాలు. పక్ష్యులలో - చేపల్లో - జంతువుల్లో అనేక బేధాలు వున్నాయి. అట్లానే మనుష్యులలో వున్నాయి. దేశం వల్ల, రేస్ వల్లా పరిస్థితుల వల్ల కలిగే బేధాలు కాక మనిషికి మనిషికి ముఖం లో -- కంఠం లో దేహాకారం లో... రేఖలలో, రుచులలో, గుణాలలో బేధాలున్నాయి. బేధాల్ని మత ప్రవక్త లు నీతి ప్రవక్త లు ఒప్పుకోరు. సర్వ మానవులకు ఒకటే మత విశ్వాసం, ఒకటే నీతి, చట్టము విధిస్తారు. ఒకరికి కుదిరిన మందు ఇంకొకరికి కుదురుతుందని, ఒకరికి ఆనందమిచ్చిన విషయం ఇంకొకరికి ఆనందమిచ్చి తీరాలని మూఢాభిప్రాయం ప్రజలనికా వదల లేదు. అసంఖ్యాకాలైన ఆనందాలిని, అభిరుచులను, సౌందర్యాలను ఏర్పరిచిన సృష్టి కొల్లబోలేదు.... వాటినన్నిటిని వివిధ రీతుల అనుభవించేందుకే వివిధాలైన స్వభావాలను సృష్టించింది. ఏకత్వం, సమానత్వం సృష్టి సూత్రానికే విరుద్ధం.

ఒక కాలం లో దేశాలకీ, సంఘాలికి సరిపడిన నీతి, ఆచారం ఇంకో కాలం లో కూడా సరిపడి తీరాలని, ఒక దేశానికి జాతికి అనుకూలించిన పరిస్తితులు ఇంకో దేశానికి జాతికి అనుకూలించాలని వాదించే వారు అనేకులు. ఎట్లా మనిషి మనిషి కు రూపము, బుద్ది, మారుతుందో అట్లానే వారి స్వభావాన్ని, సంస్కారాన్నీ, బుద్ధి ని బట్టి నీతి ఆనందం మార తాయంటే అంగీకరించరు. థియరీ లో అంగీకరించినా ఆచరణ లో ఒప్పుకోరు.

మత సిద్ధాంతులు, నీతి ప్రవక్త లు,ప్రతి వారమూ సాయింత్రమూ వేదిక నించి, రోడ్డు మూలల నుంచి వుపన్యాసాలిచ్చే దేవ భృత్యులూ ఎవరికి తోచినట్లు ఆనందపడే విధాలు ప్రకటిస్తూ వుంటారు.


"సత్యం చెప్పండి బాధలన్నీ పోతాయి" " నా గీతాలను చదవండి", క్రీస్తు ను నమ్మండి", "యోగం చెయండి", "తొట్టి వైద్యం", కార్కు టిప్పు సిగిరెట్ట్లు," , " చచ్చిన వారితో సంభాషణ" " అపక్వాహారం", "సర్వ భాతృత్వం" --తలనూనెలు - స్వరాజ్యం, -- లైబ్రరీలు, " ఇట్లాంటి వాటి ద్వారా వేనవేలు చిరతరానందాన్ని ప్రపంచాలకు ప్రకటిస్తున్నారు.


ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చే మాట నిజమే కాని కొన్ని కొన్ని కొందరికి మాత్రమే ఇస్తాయి. కాకి, చచ్చిన ఎలకను తింటే ఆనందమని ఏనుక్కి చెప్పి, చేపలా నీటిలో ఈదమని నక్క కు చెప్పినట్లు వుంటుంది. ప్రతి వాడు తన స్వభావానికి, తన గుణానికి ఆనందం కావాలో అవి కనుక్కోవాలి. స్వభావం ఆనందం వైపు ఈడుస్తుంది. కాని ప్రకటనలు చూసి మోస పోతారు. ప్రకటనలలో ముఖ్య మైనవి శాస్త్రాలు,, నీతులు, ఆచారం, ధనం, అధికారం మొదలైన భ్రాంతులు. ఒక యోగి వచ్చి ఆసనం చూపగానే అందరూ ఆసనాలు ప్రారంభిస్తారు. పండితులు వచ్చి జుట్టు గొరిగించమనగానే గొరిగిస్తారు. శాంతి లేక కొట్టూకునే ధనవంతుడు భార్య కావాలని యేడిచి పెళ్ళి చేసుకుని "ఎందుకు చేసుకున్నానని" యేడుస్తాడు. పిల్లలు లేరని ఏడ్చే వాళ్ళు,, వుద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు, ప్లీడరై కవుల వెంట పరుగెత్తే రసికుడు, పెళ్ళి చేసుకుని నమ్మకం గా నిలువలేని స్త్రీ, చదువుకుని ఆరోగ్యం పోగొట్టుకున్న రోగి,
కధలు చదివి, సినిమాలు చూసి భ్రమసి ఇల్లు వదిలి పరుగెత్తి తిరిగి వొచ్చిన జోగి, -- అందరూ, ఇట్లాంటి మూర్ఖులు - తమ ఆనందం తెలీక మాటలు నమ్మి మోసపోయిన ధౌర్భాగ్యులు,. తనకు లేని వస్తువు ఆనందం ఇస్తుందనుకోవటం ఈ భ్రమలలో ముఖ్య మైనది.


"ఈ పెళ్ళి నరకం " రా అని ఎంత మంది ఎంత చెప్పినా బాల బ్రహ్మచారి ససేమిరా నమ్మడు. " నీ పెళ్ళాన్ని వదలవేం?" అంటాడు. "ధనం వల్ల సౌఖ్యం లేదు" అని ధనికుడెంత అరిచినా బీదవాడు నమ్మడు. "ధనమంతా నాకియ్యవే" --అంటాడు. ఏ ఆనందం రాకపోయినా ఆ పెళ్ళాన్ని, ధనాన్ని వొదిలే ఆత్మబలం వాళ్ళకు లేదనే సంగతి వీళ్ళకు తెలీదు.


కొందరికి దేశ విప్లవం, కొందరికి తిండి, కొందరికి ప్రేమ, కవిత్వం, తగాదాలు, - నిద్ర - ఇట్లా అనేక ఆనందాలు వున్నాయి. తత్వాన్ని బట్టీ మారుతో, ఎవరు చెప్పిన మాట వినకుండా, తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ను నమ్ముకుంటే, ఏ మనిషికి అతని ఆనందమేదో స్పృష్టమవుతుంది. ఏ మృగానికి దాని ఆహారమేదో అర్ధమైనట్లు... కాని ఈ మనుష్యులలో జన్మమంతా మాంసం తినే ఆవులు, గడ్డి మేసే సింహాలూ వున్నాయి. -- పైగా అజీర్నమెందుకా అని ఆవు అనేక రకాల మాసం రుచి చూస్తుంది. సిం హం రక రకాల గడ్డి తెప్పించుకుని మేస్తుంది. కాని ఆ గడ్డిని ఇది ఆ మాంసాన్ని అది వొదిలే తెలివితేటలు కాని, ధైర్యం కాని, శక్తి కాని వాటికి వుండవు.

కవిత్వం చదివి " ఆహా సూర్యాస్తమయం యెంత అందమైనది ! నేను చూడనే లేదే " అని ఒకడు సాయింత్ర్రం గోదావరి గట్టున కూర్చుంటే ఆ ఆనందం వొస్తుందా? ఆవడలో, ఇంటి తగాదాలో, సినిమా కథలో, ఏదో తలుచుకుంటూ కూచుంటాడు అంత సేపు...!


అట్లానే కొందరికి త్యాగం ఆనందమిస్తుంది -- కొన్ని పరిస్తుతులలో. కాని ప్రతి వుపన్యాసకుడు, గ్రంధకర్తా త్యాగం చెయ్యమనే వాడే -- కవిత్వానికని, సత్రానికని, కొడుకు పెళ్ళికని, దేశానికనీ, పత్రిక్కి చందా కని త్యాగం రాదు. ఏ స్వభావానికి ఏ త్యాగం ఆనందమిస్తుందో అదే అవసరం, ఆరోగ్యమూ... కొందరికి అసలు త్యాగమే పనికి రాదు. చాలా మంది త్యాగాలు ఏదుస్తూ చేస్తారు. మతము ధర్మము డ్యూటి అని పేర్లు పెట్టి త్యాగాలు చేస్తారు. సాధారణం గా తల్లులు భార్యలు చేసే త్యాగాలు ఇట్లాంటివే. ఎవరికే త్యాగం అవసరమో వళ్ళ ఆనందమే నిర్ణయించాలి. ఒక స్త్రీ తన భర్త ను వదిలి పిల్లలను వదిలి పనికిమాలిన ప్రియుడి వెంట వెళుతుంది. ఇంకో స్త్రీ పనికి మాలిన భర్త కోసం ప్రియుణ్ణీ లోకాన్నీ, పిల్లలనీ వదులుకుంటుంది. ఇంకో ఆమె బిడ్డ కోసం భర్త ని, సంఘాన్ని, నీతి ని వదులుతుంది.. వీటిల్లో సంఘానికి నచ్చినవి మెచ్చుకుంటారు. తక్కినవాటిని ఖండిస్తారు. కాని ఏది ధర్మమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే కాని మనుష్యులు కాని శాశ్త్రాలు కాని నిర్ణయించలేవు... ఎందుకంటే ఆనందమివ్వని ధర్మం నీ ధర్మం కాదు, ఇంకొకడిదీ,

దేశానికి ప్రతివాడు త్యాగం చెయ్యాలని అంటారు. అక్కర్లేదు అంటే తిడతారు. ఎవరి హృదయం దేశభక్తి తో పరవశమౌతుందో వాళ్ళు సర్వము త్యాగం చెయ్యనే చేస్తారు. ఇది మన ధర్మం కనక చేయాలి అనే ప్రసక్తే వుండదు... "ఇది నా ధర్మం" అనుకునేప్పటికే ఇతరులు విధించిన ధర్మమని వ్యక్తమవుతుంటుంది... అట్లా దేశభక్తి వల్ల అనందం రాని వాళ్ళు ధర్మమని కీర్తికని, పక్కవాడు చేసేడని, చాలామంది చేసేరు... త్వరలోనే చింతించారు... వారి స్వభావం ఆ త్యాగానికి తగినది కాదు గనుక.

సుఖము బాధ పరిస్తితులు తెచ్చి పెడుతు వుంటాయి, చాలా మంది ఏమి ఆలోచించకుండా అనుభవిస్తూ బతుకుతారు. తాము ఎంత వరకు ఆ బాధలకు కారణం, తప్పించుకోవటానికి తమ ప్రయత్నమెంతవరకు వుపయోగపడుతుందో, యోచించరు. కర్మ లోనూ, జ్యోతిష్కం లోను నమ్మకం ఈ నిద్ర కు తోడ్పడి, జోల పాడుతుంది. జీవితం లో సంతోషం లేనప్పుడు కొత్త సంతోషము కల్పించుకోగలం. బాధలు తటస్తించినప్పుడు నిగ్రహించుకోగలం. బాధను ఎదిరించి పోట్లాడితే చాలా వరకు లోబడుతుంది. కాని ఆ జ్ఞానము శక్తీ చాలా కొద్ది మందికే వున్నాయి.

లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది., కాని అనుభవించమని బలవంతపెట్టగలదా? అట్లానే జీవితం కష్టాలను కల్పిస్తుంది, కాని అనుభవించమని బలవంత పెట్టలేదు.

వెయ్యకు తొమ్మిదివందల తొంభైమందికి ప్రత్యేకం గా ఏదో అందరాని ఆనందాన్ని సాధించాలనే ఆర్జి వుండదు. ఇంకా మృగాల స్తితి లోనే వున్నారు. సుఖం గా తినటమూ, కనడమూ , చావడమూ , వాళ్ళు చేయవలసిందల్లా. అదే వాళ్ళ ఆనందము. కాని ఆ సంగతి గమనించరు. ఘన కార్యాలు చేసిన వాళ్ళ గురించి విని కని, చదివీ, తమకు లేని శక్తులు వున్నయనుకుని అనుసరించ పోతారు. ప్రయత్నించి విఫలులైన బోసులూ, శాండో లు, శుక మహర్షులు, రవీంద్రులు, I.C.S లు ఎందరో వున్నారు మన మధ్య. నరకం, స్వర్గం సంగతులు విని, భయపడి, ఆశపడి భక్తి ని, వైరాగ్యాన్ని, నటిస్తారు. దాని వల్ల రోగాలు బాధలు అప్పులు ఇన్ని పడతారు. ఎంత తన్నుకున్న శాస్త్రాలు ఎంత ఘోషించినా ఎన్ని తత్వాలు పాడినా అందరు విరాగులు కాదు, ధర్మాత్ములు కారు. ఆ పాడే వాళ్ళకు తెలుసు "అన్నళ్ళీ ముచ్చటలు - తనువులు శాశ్వతమా" అని పాడి విరక్తి పుట్టిస్తారు. కాని ఒక్క గుప్పెడు బియ్యం మీదో, ఒక్క కానీ మీదో మనకు విరక్తి కలిగితే చాలు ఆ పూటకి, వాడికి తృప్తి. తమ జీవితం లో ఆనందం ఎట్లా కలుగుతుందో తెలిసినా, ఆ ఆనందం కోసమే ప్రయత్నం చేసి ఆటంకాలను వదులుచుకునే వాళ్ళూ చాలా కొద్ది మంది. ప్రతి పని విషయమై కూడా
'ఇది నా ఆత్మ కు ఆరోగ్యమా కాదా? నాకు లభ్యమైన కాలాన్ని, శక్తి ని, ధనాన్ని ఆనంద రూపం గా మారుస్తున్నానా లేదా?' అని విమర్శించరు. మొహమాటం, ప్రతిష్టా, భేషజం, కపటమూ ఇన్నీ అడ్డం వస్తాయి.

వొంటి నిండా చీము తో, చెయ్యి ఎత్తలేక వొణికే వాడికి కానీ ఇవ్వము. మనకి అక్కర్లేని పత్రికకు చందాగా అప్పుడే ఇంకొకడు నాలుగు రూపాయిలు పట్టుకుని పోతాడు.

మనం మీటింగులకు ప్రెసిడెంట్లు గా వుండటం, అనుష్టించే కర్మ కలాపాలు, తగాదాలు, అన్నీ మాత్రమైనా ఆరోగ్యాన్ని ఇస్తాయా? వుత్తమ లోకం లో నమ్మకం లేని వాడు బ్రాహ్మల కాళ్ళు కడిగి తద్దినం పెడతాడు. బ్రాహ్మణ్ణి తిట్టి కమ్మ బ్రాహ్మణ్ణి పూచ్చేసి దక్షిణలిస్తాడు.

మన వేషం, బట్టలు, జుట్టు, తిండి, మనం పెట్టే భోజనాలు, ఆడే మాటలు, అన్నీ ఏమీ ఆనందం ఇవ్వని శుష్కమైన ప్రదర్శనాలు --ఎన్ని!
జీవనమంతా వాటితోనే వృధాగా గడిచిపోతుంది. మనకు ఆనందం ఇచ్చే వాటిని అనుభవించటానికి జంకుతాము. ఎవరు చూస్తున్నారో అనే భయం తో, చక్కని మనిషి నడుస్తో వుంటే తేరి చూడ్డానికి భయం, భోగమాట చూడ్డానికి భయం, బట్టలు లేని బొమ్మలు, వెంకటాచలం కధ లు ఇవన్నీ రహస్యం గా ఆనందిస్తాము.

ఇట్లా ఏళ్ళకు ఏళ్ళు గడిచి పోతాయి. మనకు ఆనందం వుంది అని ఇతరులు అనుకోవటానికి ఆనందాన్ని ధార పోస్తాం. మనం కట్టే డాబైన ఇల్లు, మోసే బంగారు నగలు, చేసే గొప్ప పెళ్ళిళ్ళు, ఖర్చులు, కష్టాలు, ఏడిపించుకు తినే అల్లుళ్ళు, అన్నీ ఒక రవ్వ ఆనందాన్ని ఇవ్వవు. కొడుకుని ద్వేషిస్తాము; వొదిలే ధైర్యం లేదు, భార్యలు భర్తలను, భర్తలు భార్యల్నీ,వొదిలే ధైర్యం లేదు. ఇష్టం లేని వాడు వొస్తే వొద్దని చెప్పే ధైర్యం లేదు.

నీ జీవితం దేనికి, ఆనందానికి ఏర్పడిందో చూడు. ఆనందం నీతి గాని కాక పోని, ధర్మం కానీ, అధర్మం కానీ, వున్నతం కానీ కాక పోనీ .... అన్నిటినీ -- బంధువుల్నీ, కులాన్నీ, నీతిని, చివరకు నీ సౌఖ్యాన్ని, అన్నిటిని త్యజించి అవసరమైతే అధర్మాన్ని ఆశ్రయించు. ప్రయత్నమే, కష్టమే, రాపిడే ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. నీ ఆత్మ లో కొత్త విస్తీర్ణం, నీ కళ్ళ ముందు కొత్త లోకాలు వెలుగుతాయి. తప్పు కానీ, ఒప్పు కాని వెనుక ముందు చూడకు. తప్పైతే దిద్దుకోవటానికి చాలా కాలముంది. వెనుకముందులు యోచించే చచ్చు బతుకు కంటే ధీరత్వంతో ముందుకు సాగి గోతిలో పడేవాడికి ఎక్కువ ఆనందముంది లోకం లో.

ఆనందాల్లో డిగ్రీలున్నాయి. పేడ తింటో సుఖించే పురుగూ, కాంతిలో ఎగురుతు అరిచే చిలుకా, డబ్బు లెక్క పెడుతో తన్మయత్వం లో పడే పిసినారి, దేశం కోసం గుండు దెబ్బ తిని చస్తో ధన్యుణ్ణనుకున్న యోధుడూ, స్త్రీ బొమ్మ ను చెక్కి తను కల్పించిన ఆనందాన్ని తాను చూసి మూర్చిల్లే శిల్పీ, అనంత విశ్వం లో తన ఆత్మ ను కలిపి సర్వ జీవుల సుఖ దుఖాలు తనలో అనుభవించగల యోగీ, అందరూ ఆనందాన్నే అనుభవిస్తున్నారు. కానీ అన్నీ ఒకటే డిగ్రీలోవి కావు. లోకం చూసిన కొద్దీ అనుభవం విషయం లో కూడా 'లైఫ్' లో గొప్ప 'ఎవల్యూషన్ ' కలుగుతున్నట్లు తోస్తుంది.

కొత్త ఆనందాలను సగం సగం తోచి తామందుకోలేని సౌందర్యాలనూ, అనుభవించే విధం తెలీక, తపన పడి, జీవులు తమ ఇంద్రియ శక్తి ని మార్చుకోవాలని తమకు తెలీకుండానే ప్రయత్నించి ఒక రూపం నుంచి ఇంకో రూపం పొందుతున్నట్లు తోస్తుంది. రెక్కల పురుగు ఇంకా విస్తీర్ణత ను కోరి కోరి చిలుక కావొచ్చు. పిల్లి ఇంకా బలాన్ని గభీరాన్నీ కోరి సిమ్హం కావొచ్చును. అట్లాగే ఒకడు తనలోలేని శక్తుల్నీ కోరి కోరి జన్మలోనైతేనేం, లోకంలోనైతేనేం, పాటకుడూ, వస్తాదూ, యోగీ, కిన్నరుడూ లేక రాక్షసుడుగా మార వచ్చు. అట్లాంటి మార్పు రాక పోతే, నా హృదయం లో చూచాయ గా తోచే వున్నతానందాలూ, నేను కలలు గనే లోకాలకి సంబంధించని సౌందర్యాలు, నేను పొందాలని కోరే మానవాతీత శక్తులూ ఇవన్నీ అర్ధ విహీన మవుతాయి. భోజనమూ, ఆరోగ్యమూ, ధనమూ వుండి కూడా ఆత్మలు ఎందుకిట్లా తమకే తెలీని ఆరాటాలతో బాధ పడాలి? పాకే బిడ్డ ఎన్ని సార్లు పడి దెబ్బ తిన్నా నడవాలని ఎందుకు ప్రయత్నం చెయ్యాలి? అదేననుకుంటా, సృష్టి సూత్రం. మనం అందుకోగలిగి నంతవరకు అభివృద్ధి ఒక్క జీవితం లోనే నిశ్చయం గా పొందగలుగుదుమనుకునే వాళ్ళు మూర్ఖులు, జన్మలనేవి వుంటే, ఎప్పటికో సాధించవలసిందే. ఏమైనా, ఆనందానికిగాని చేసే ప్రయత్నం కూడా ఆనందమివ్వాలి. ఇవ్వకపోతే నీ ఆనందం అది కాదు.

"నీకింకేం కావాలి, ఎందుకట్లా వెతుకుతా?" వంటారు మిత్రులు.

'కారణం లేని ఆరాటం -- సృష్టికి అర్ధమేమిటి, నీతి ఏమిటి, పాపమేమిటి, నేను నమ్మేవి చేసేవి సత్యమా -- అనే మీమాంస, కొత్త సౌందర్యాలకోసం, ఎండమావుల కోసం వలే, రెప్పలార్చుకుంటో పరుగులు: మనకు కానిది, మనం అందుకోలేనిది, మనం మిస్ అయింది, ఎంతో లోకం, ఎంతో జీవితం, కాలం, అందం వృధా పోతుందనే దిగులు -- ఇవేమి లేకుండా తక్కిన వారివలే బతికి కూచోకూడదా ?' అని అడుగుతుంది శ్రమపడ్డ ఆత్మ.

కాని ఏమి లాభం? ఎందుకా విధం గా రెక్కలు కొట్టుకుంటో పరుగెత్తుతావు? నేను నీకు పళ్ళు పెడతాను, ఆడ చిలుక ను తెస్తాను, నా ఇంట్లో వుండమని చిలక నడిగి ఏమి లాభం... ???

10 comments:

  1. Thanks for sharing this Bhavana. Have issues with copy and paste in telugu. Hence this quick comment. Last two paras are what am stuck at in my life. quest for the best no matter what it takes.

    ReplyDelete
  2. హ్మ్మ్ నాకు "ఆనందం" కావాలి!

    ReplyDelete
  3. ఆహా మరొకసారి తీయటి చలం తెలుగు ,ఆలోచనలు గుర్తు చేసారు ..ఆనందం కోసం చలం ని మళ్లీ మళ్లీ చదవాలి.

    ReplyDelete
  4. ఉష మీరు అదృష్టవంతులు, మన స్థాయి కి మించిన ఆనాందాలు వున్నయని గుర్తు పట్టి ఆలోచించగలుగుతున్నారు నేనైతె ఇంక స్వభావాలు గుణాల మద్య పరిస్తితులను సమన్వయ పరుచుకోవటం లోనే వున్నా.. అవి సమన్వయ పరుచుకుని ఆనందపు దారులు వెతికితే కదా ఇంకా వున్న ఆనందాల ఆచూకి తెలుసుకోగలగటం. ఆరాటం తపన మొదలు ఐంది కద తప్పక పరుగులో శ్రమపడ్డ ఆత్మ కు సమాధానం దొరుకుతుంది మీకు. All the best

    మహేష్ పరిస్తితులను, స్వభావాలను సమన్వయ పరుచుకున్న కొద్ది మంది లో మీరు వున్నారనుకుంటే నేను, మీరు ఇంకా ఆనందం కావలంటున్నారు ఏమిటి చెప్మా?

    సత్యమేవజయతే: అవును చలం ను గుర్తు చేసుకోవటమే ఒక ఆనందం. ధన్యవాదాలు

    ReplyDelete
  5. మహేష్. ఫండమెంటల్ గా స్త్రీవాదాన్ని వ్యతిరేకించే నీకు చలం గారి సాహిత్యంతో ఏమి పని? నేను నా కథలలో వదిన-మరిదులు పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాస్తే గూగుల్ చాట్ లో నన్ను తిట్టావు కదా. ఇంత సంకుచిత నమ్మకాలని నమ్మే నీకు చలం గారు స్త్రీవాదం ఎలా అర్థమవుతుంది? చలం గారి పేరుని వ్యక్తిగత పాపులారిటీ కోసం దుర్వినియోగం చెయ్యకు. http://sahityaavalokanam.net/?p=207

    ReplyDelete
  6. @ప్రవీణ్ శర్మ: నీకు స్త్రీవాదం చలం రెండూ అర్థం కావని నీ రచనల్ని వాదనల్నీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నీతో చర్చించే ఓపికా తీరికా నాకు లేవు.

    ReplyDelete
  7. బాబా గారు నాకెందుకండి థ్యాంక్స్...
    వాసుదేవ్ గారు, మీ కామెంట్ ఇంకో పోస్ట్ లోకి వెళ్ళినా మీకు ఇక్కడ కూడా సమాధానం చెపుతున్నాను. తప్పకుండా ప్రయత్నిస్తాను అండీ పురూరవ, సావిత్రి నుంచి. పురూరువ నాటకం కదా మద్యలో ఒక్క చాప్టర్ తీస్తే ఎలా వుంటుందో మరి... సావిత్రి నాకు కూడా ఇష్టం... తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు...

    ReplyDelete
  8. మీ బ్లాగ్ బాగుంది .. కామెంట్స్ కి బ్యాక్ గ్రౌండ్ మారిస్తే ఇంకా బాగుంటుంది ఏమో అని నా అభిప్రాయం అండి..

    ReplyDelete
  9. ధన్యవాదాలు శ్రీ. కామెంట్ ల వరకు మార్చటానికి రావటం లేదండి బ్యాక్ గ్రౌండ్. ఫాంట్ కలర్ మార్చేను, మీ సలహా కు నెనర్లు.

    ReplyDelete